సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు పీఎఫ్‌ఐ(ఫాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సభ్యులను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరాటే శిక్షణ ముసుగులో ఓ మతస్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేలా మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారని సీపీ నాగరాజు వెల్లడించారు.
చురుకైన, ఆవేశపరులైన యువతను పీఎఫ్‌ఐ ఎంపిక చేసుకుంటోందని తెలిపారు. సిమిపై నిషేధం విధించిన తర్వాత పీఎఫ్‌ఐ పుట్టుకొచ్చిందని.... ఈ సంస్థకు చెందినవారు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ సీపీ నాగరాజు వివరించారు.
''నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశాం. షాదుల్లా, ఇమ్రాన్, మోబిన్... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అరెస్టు చేశాం. ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా యువతకు శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. కరాటే ముసుగులో కార్యకలాపాలు జరుపుతున్నారు. దాడులు చేయడం, అల్లర్లు సృష్టించడం ఈ ముఠా పని. ఈ ముఠాకు ఇతర రాష్ట్రాల్లోనూ సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఒక వర్గంలోని చురుకైన యువతను పీఎఫ్‌ఐ ఎంపిక చేసుకుంటోంది. మరో వర్గంపై వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారు. మానవ విస్ఫోటనంగా మార్చడమే ఈ శిక్షణ ఉద్దేశం. ఇతర వర్గాలపై దాడి, అవసరమైతే దేశాన్ని అస్థిరపరచడమే ఈ ముఠా లక్ష్యం.'' - నాగరాజు, నిజామాబాద్ సీపీ
ఇదిలా ఉంటే నిజామాబాద్ ఎంపీ అర్వింద్, పోలీస్ కమిషనర్ నాగరాజు మధ్య ఈ విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర నిఘావర్గాలు సమాచారం ఇస్తేనే పీఎఫ్ఐ సభ్యుల అరెస్టులను తప్పక అరెస్టు చేశారని ఎంపీ అర్వింద్ సీపీపై మండి పడ్డారు. జిల్లా పోలీసుల నిఘా లోపించిందని ఆరోపించారు. ఎన్నికల్లో దాడులు చేయించేందుకు సీపీ... వీటి వెనుక ఉండి నడిపిస్తున్నారని.. అందుకే తెరాస ప్రభుత్వం అతన్ని నిజామాబాద్‌కు తీసుకొచ్చిందని అర్వింద్ పేర్కొన్నారు. సీపీని తక్షణం ఇక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి సీపీ నాగరాజు పరోక్షంగా బదులు చెప్పారు. కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. కళ్లు, చెవులు మూసుకుని మాట్లాడుతున్నారని కమిషనరేట్‌లో జరిగిన ప్రెస్మీట్లో స్పందించారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ వర్సెస్ భాజపా.. పోటాపోటీ నిరసనలు