మూలికా వైద్యం సూత్రాలు(ఫార్ములా) విక్రయిస్తే రూ. 5కోట్లు ఇస్తానంటూ వైద్యురాలి నుంచి రూ.42 లక్షలు కొల్లగొట్టిన నైజీరియన్‌ను సైబర్ క్రైం పోలీసులు దిల్లీలో పట్టుకున్నారు. పదిహేను రోజుల పాటు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ ఖాతాలు, చిరునామాలు పరిశోధించి ఈ నేరానికి పాల్పడింది దిల్లీలో ఉంటున్న మెస్సీ డాన్ హోగా గుర్తించారు. ఇద్దరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మోహన్ గార్డెన్ ఠాణా పరిధిలో నివసిస్తున్న డావ్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 31 ఏటీఎం కార్డులు, 12 బ్యాంక్ పాసుపుస్తకాలు, 13 చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.
స్నేహితులతో కలిసి నేర్చుకుని..
దక్షిణాఫ్రికాకు చెందిన మెస్సీడా హో(34) నైజీరియాలో సరైన ఉపాధి అవకాశాలు లేక మూడేళ్ల క్రితం వ్యాపార పాస్పోర్టుతో దిల్లీకి వచ్చాడు. ఉపాధి అవకాశాలు త్వరగా లభించకపోవటం వల్ల అక్కడే ఉంటున్న నైజీరియన్లతో స్నేహం చేశాడు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పెళ్లి చేసుకుంటామంటూ మోసాలు చేస్తుండగా గమనించాడు. స్నేహితుల మోసాలకు సహకరించి వేలల్లో సంపాదించాడు. పోలీసులకు అనుమానం రాకుండా అంతర్జాల మోసాలు చేసేందుకు మోహన్ గార్డెన్స్‌లో ఓ చిన్న బేకరి, కూల్‌డ్రింక్స్ దుకాణాన్ని రెండేళ్ల క్రితం ప్రారంభించాడు. స్నేహితులతో కలిసి ఏడాది పాటు నేరాలు చేసి వారితో విడిపోయాడు. ఏడాది క్రితం నుంచి సొంతంగా మోసాలకు తెరతీశాడు. కరోనా నేపథ్యంలో మందులు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, పరికరాలకు గిరాకీ ఉందని తెలుసుకున్న మెస్సీ... వైద్యులు, ఫార్మా కంపెనీల వారికి ఫోన్లు చేసి వారి నుంచి రూ. వేలు, రూ.లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాడు.
రూ. 5 కోట్లు ఇస్తానని..
మెహదీపట్నంలో ఉంటున్న వైద్యురాలికి ఇరవై రోజుల క్రితం ఫోన్ చేసిన మెస్సీ... తాను లండన్‌లో ఉంటున్న వైద్యనిపుణుడిగా పరిచయం చేసుకున్నాడు. వైద్యురాలు తయారు చేస్తున్న మూలికల ఫార్ములా విక్రయిస్తే రూ. 5 కోట్లు ఇస్తానంటూ నమ్మించాడు. పౌండ్లలో దిల్లీ ఎయిర్‌పోర్టుకు పార్సిల్ పంపించానని చెప్పాడు. ఆర్బీఐ, కస్టమ్స్ పేరుతో రూ. 42 లక్షలు కొట్టేసిన మెస్సీ.. తాను దిల్లీకి తీసుకువచ్చిన పౌండ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని... ఈలోపు తన కూతురు చనిపోయిందంటూ వార్త వచ్చిందని వైద్యురాలికి చెప్పాడు. లండన్ వెళ్లేందుకు రూ.20 వేలు కావాలంటూ అడగ్గా.. నిజమేనని నమ్మిన వైద్యురాలు ఆ డబ్బు పంపింది. తరువాత మెస్సీ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.
అన్ని ఆధారాలతో సహా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మెస్సీని తమదైన శైలిలో విచారించారు. పాస్‌పోర్ట్ గడువు పూర్తికావడం వల్ల గతేడాది అక్టోబరులో మోహన్ గార్డెన్ ఠాణా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.