New Bride Murder: ఏపీలోని వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు మండలం సోమయాజులపల్లెకు చెందిన వెంకటభార్గవికి నెలన్నర క్రితం పెళ్లైంది. అత్తారింట్లో హాయిగా కాపురం చేసుకుంటున్న ఆమె.. ఆషాఢమాసం అడ్డు రావడంతో పుట్టింటికి వచ్చింది. ఈనెల 18న దుస్తులు తెచ్చుకునేందుకు మైదుకూరుకు వెళ్లింది. అంతే.. తిరిగి మళ్లీ ఇంటికి రాలేదు.
ఈ నెల 19న వెంకటభార్గవి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికే చెందిన బొందల గోపాల్ అనే అతనిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. దీంతో అతను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. భార్గవిని తానే హత్య చేశానని అంగీకరించాడు. అతడిని వెంట పెట్టుకుని స్థానిక వనిపెంట అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. తరలించేందుకు వీలు కాకపోవడంతో అక్కడే శవపరీక్ష నిర్వహించారు.
కుమార్తె మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి కుప్పకూలిపోయాడు. అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేమీ లేక తండ్రే.. ఎముకలగూడుగా మారిన కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ.. అటవీ ప్రాంతం నుంచి బయటకి తీసుకొచ్చారు. అనంతరం అక్కడినుంచి ఆటోలో తరలించారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారిని కలచివేసింది. నిందితుడు గోపాల్‌కు పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్గవి బంగారు నగలు దోచుకున్న గోపాల్.. బ్యాంకులో రుణం తెచ్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు హత్య చేయడానికి కారణాలేంటో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇవీ చదవండి: యాదాద్రి టూ హన్మకొండ.. ఈసారి ప్రత్యేకంగా బండి సంజయ్ మూడో విడత యాత్ర..