స్థిరాస్తి వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో పురోగతి లభించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో కీలక నిందితుడు త్రిలోక్‌నాథ్ బాబా ఉన్నాడు. త్రిలోక్నాథ్ను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
బాబాతో పాటు మరో నిందితుడు కార్తీక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. భాస్కర్ రెడ్డి హత్యకు ముందు.. ఆహారంలో కార్తీక్ మత్తు మందు కలిపి ఇచ్చాడనే ఆరోపణలతో అతడిని విచారిస్తున్నారు. ఈ రోజు నలుగురు నిందితులు మల్లేశ్, సుధాకర్, కృష్ణం రాజు, ఆర్ఎంపీ వైద్యుడిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్ర ఎంతమేరకు ఉందనేది దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా గుప్త నిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగింది..
ఏపీలోని నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి.. గత నెల 20న హత్యకు గురయ్యారు. ఆ రోజు నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భాస్కర్ రెడ్డి అల్లుడు జయసృజన్ రెడ్డి.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నివాసం ఉన్న హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేపట్టారు. కారులో భాస్కర్ రెడ్డిని నలుగురు వ్యక్తులు తీసుకెళ్తున్నట్లుగా నిఘా నేత్రాల ద్వారా గుర్తించారు. కారు నంబరు ఆధారంగా మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు ఆర్ఎంపీ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య కుట్ర బహిర్గతమైంది.
స్థిరాస్తి వ్యాపారి హత్య కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
మల్లేశ్ కుమారుడు కార్తీక్ సాయంతో భోజనంలో మత్తు మందు కలిపి భాస్కర్ రెడ్డికి ఇప్పించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయన ఆ ఆహారం తిని స్పృహ కోల్పోయిన అనంతరం కారులో తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ కుట్ర కోణంలో నెల్లూరుకు చెందిన గురూజీ త్రిలోక్‌నాథ్ బాబా హస్తం ఉన్నట్లు నిర్ధరించిన పోలీసులు.. ఆ బాబా కేరళలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: kaleshwaram project: శిథిలావస్థలో చెరువు కట్ట.. గండితో ప్రమాదంలో పొలాలు.!