shilpa chowdary custody news : పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని రెండో రోజు కస్టడీలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలుండగా... డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారని... పలువురి నుంచి తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. శిల్పను పోలీసులు శుక్రవారం మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయస్థానం అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు... రెండోరోజు విచారణ జరుపుతున్నారు. అధిక వడ్డీల పేరిట ఆశ చూపి దండుకున్న కోట్ల రూపాయలను ఎక్కడకు మళ్లించారనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఆదివారం వరకు..
shilpa chowdary cheating case: గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్‌లో ఉంటున్న శిల్ప దంపతులు స్థిరాస్తి, అధిక వడ్డీలు అంటూ పలువురిని బురిడీ కొట్టించి కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. గత నెలలో వీరిపై బాధితులు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మోసాలకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇటీవల శిల్పను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు... ఆమె నుంచి సరైన సమాచారం సేకరించలేకపోయారు. దీంతో మరోసారి న్యాయస్థానం అనుమతితో శిల్పను కస్టడీలోకి తీసుకున్నారు. ఆదివారం వరకు ఆమెను పోలీసులు విచారించనున్నారు.
'మేమూ.. బాధితులమే..'
మొదటిసారి పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలనే శిల్ప మళ్లీ చెబుతున్నట్టు సమాచారం. కిట్టీపార్టీల్లో పరిచయమైన వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను పెట్టుబడులుగా మలిచేందుకు కొందరు వ్యాపారులకు ఇచ్చినట్టు చెబుతున్నట్టు తెలుస్తోంది. పొంతనలేని సమాధానాలు విచారణలో చెబుతున్నట్టు సమాచారం. ఆమె డబ్బులు ఇచ్చినట్టు చెప్తున్న వారు కూడా... తామూ బాధితులమే అంటున్నారు. దీంతో కేసు గందరగోళంగా మారింది. మొత్తంగా నిందితురాలు శిల్ప పలువురిని మోసం చేసి వసూలు చేసిన కోట్ల రూపాయలు ఎక్కడకు మళ్లించిందనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.
బ్యాంక్ ఖాతాలు స్వాధీనం
చంచల్గూడ మహిళా జైళ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శిల్పను శుక్రవారం నాడు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో వైద్య చికిత్సలు చేయించారు. అనంతరం నార్సింగి ఎస్వోటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆమెపై నార్సింగి పీఎస్లో ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. రూ.7 కోట్ల మోసం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరికొంత మంది నుంచి డబ్బులు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. శిల్ప ఇంట్లో నుంచి పోలీసులు ఇప్పటికే పలు పత్రాలు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకున్నారు.
'ఇంకా ఎవరైనా ఉన్నారా..?'
ఇతరుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు... కొంతమందికి ఇచ్చినట్లు శిల్పా చౌదరి పోలీసులకు తెలిపారు. శిల్ప చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు పలువురికి నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల పాటు శిల్పను ప్రశ్నించి... ఆమె వద్ద నుంచి పలు వివరాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చదవండి: shilpa chowdary custody news : శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు