Mystery deaths in Karimnagar : ఓ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. అంతు చిక్కని వ్యాధితో నెల రోజుల వ్యవధిలో భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి మరణాన్ని జీర్ణించుకోలేక భర్త నిన్న నిద్రమాత్రలు మింగాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో చోటు చేసుకున్న ఈ వరుస మరణాలు మిస్టరీగా మారాయి.
కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన వేముల మమత 20 నెలల కుమారుడు అద్వైత్ నవంబరు 16న, అయిదేళ్ల అమూల్య అదే నెల 29న వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృతి చెందారు. కుమారుడు, కుమార్తె మరణంతో కుంగిపోయిన మమత కూడా ఈనెల 15న అవే లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భర్త శ్రీకాంత్ హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా 3రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత ఆమె కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురి మృతికి కారణాలు మాత్రం వైద్యులు స్పష్టంగా చెప్పలేదు. వైద్య పరీక్షల్లో అన్నీ సాధారణంగా ఉన్నట్టు వెల్లడైందని చెబుతున్నారు.
ఇటీవల జిల్లా మలేరియా అధికారులు బాధితుల ఇంటిని పరిశీలించారు. శ్రీకాంత్ తల్లిదండ్రుల రక్తనమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణలో ఉన్న చేదబావి నీటిని తాగుతున్నట్టు వైద్య సిబ్బంది గుర్తించారు. ల్యాబ్ నుంచి తల్లిదండ్రుల రిపోర్టులు రాకముందే మమత భర్త శ్రీకాంత్ శుక్రవారం నిద్రమాత్రలు మింగాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. 45 రోజుల వ్యవధిలో కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో శ్రీకాంత్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆ కుటుంబానికి ఏమైందని గ్రామస్థులు మదనపడుతున్నారు. అంతు చిక్కని వ్యాధితో ముగ్గురు, నిద్రమాత్రలు మింగి మరొకరు మృతి చెందడంతో గంగాధరలో కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ మరణానికి అత్త, మామ, బావమరుదులు కారణమని శ్రీకాంత్ బావ ఆరోపించారు. శ్రీకాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: