జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య(50) అపహరణ వ్యవహారం సుఖాంతమైంది. శంకరయ్యను కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి చేసినట్లు ముంబయి పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ నుంచి వస్తూ ముంబయి విమానాశ్రయంలో దిగాక.. శంకరయ్యను గత నెల 22న దుండగులు కిడ్నాప్ చేయగా.. బాధిత కుటుంబసభ్యులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు వారం పాటు గాలించారు.
తమిళనాడులోని కుంభకోణం పట్టణ సమీపంలోని ఓ స్థావరంలో శంకరయ్యను బందీగా ఉంచినట్లు గుర్తించి.. శనివారం రాత్రి స్థానిక పోలీసుల సహకారంతో దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల చేతుల్లో బందీగా ఉండి అస్వస్థతకు గురైన శంకరయ్యను చెన్నై నుంచి ముంబయికి విమానంలో తరలించారు. ఆయనకు పోలీసుల ఆధ్వర్యంలోనే ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. అసలు శంకరయ్యను ఎందుకు కిడ్నాప్ చేశారు? బంగారం అక్రమ రవాణాకు వాడుకున్నారా? ఆయన వద్ద ఉన్న డబ్బులు, బంగారం దోచుకునేందుకు అపహరించారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ జరిగింది.. ముంబయి విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో ఆ నగర శివార్లలో జూన్ 22న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరికి చెందిన మత్తమల్ల శంకరయ్య అపహరణకు గురయ్యారు. ఆగంతకులు కాళ్లు, చేతులు కట్టేసి శంకరయ్యను బందీగా ఉంచిన ఫొటోను వాట్సాప్‌లో ఆయన కుమారుడు హరీశ్‌కు పంపించారు. అనంతరం ‘రూ.15 లక్షలు ఇస్తేనే వదిలిపెడతాం. మీరు ఎక్కడికి డబ్బులు తెచ్చిస్తారో చెప్పండంటూ’ ఇంటర్‌నెట్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ హరీశ్‌ను బెదిరించారు.
దాంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన తాము రూ.15 లక్షలు ఎక్కణ్నుంచి తెచ్చివ్వగలమంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అపహరించిన వారు తన తండ్రిని చంపేస్తారేమోననే భయం వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఘటనపై ముంబయిలో కేసు నమోదు కాగా.. పోలీసులు కేసును ఛేదించారు.