Mother sells daughter for money in khammam : నవమాసాలు మోసి కనిపెంచిన ఓ మహిళ తల్లి అనే పదానికే మాయని మచ్చలా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సింది పోయి డబ్బుకోసం కన్నబిడ్డను అమ్మేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ బాలిక(16)ను ఆమె తల్లి గతేడాది ఏప్రిల్‌లో మరో మహిళకు విక్రయించింది. సదరు మహిళ స్థానిక వరంగల్ క్రాస్‌రోడ్డులోని తన ఇంటికి తీసుకెళ్లింది. ఓ గదిలో బంధించి వ్యభిచారం చేయాలంటూ బాలికను సదరు మహిళతోపాటు ఆమె భర్త హింసించారు. బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారు. ఈక్రమంలో వేర్వేరు ఊళ్లకూ పంపేవారు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన బాధితురాలు దాదాపు ఏడు నెలల పాటు నరకం చూసింది.
తప్పించుకొని నగరానికి చేరి.. గత నెల 10న భార్యభర్తలిద్దరూ బాలికతో గొడవ పడి బంగారు కమ్మలు, వెండిపట్టీలు, నగదు లాక్కొని తీవ్రంగా కొట్టారు. తప్పించుకునేందుకు అవకాశం కోసం చూస్తున్న బాలిక మర్నాడు ఖమ్మం నుంచి తప్పించుకొని నగరానికి చేరుకుంది. హయత్‌నగర్ పోలీసు ఠాణా పరిధిలో నివాసముంటున్న సోదరి ఇంటికి వచ్చింది. 23వ తేదీన వ్యభిచార నిర్వాహకులు ఇక్కడికి చేరుకొని .. మీ చెల్లెలు చోరీచేసి వచ్చిందని... ఎక్కడుందో చెప్పాలని ఒత్తిడి చేశారు. ఆమె చెప్పకపోవడంతో ఎక్కడ కనిపించినా వదిలిపెట్టబోమని చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు ప్రాణభయంతో గురువారం షీˆటీమ్‌ను ఆశ్రయించి తనకు జరిగిన ఘోరం గురించి వివరించినట్లు సమాచారం. ఈ మేరకు హయత్‌నగర్ పోలీసులు ‘జీరో’ ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి కేసును సంబంధిత పోలీసు ఠాణాకు బదిలీ చేసినట్లు తెలిసింది.