MOST WANTED THIEF ARRESTED: అతనికి ఫలానా ఇంట్లో చోరీ చేసినట్టు కల వచ్చిందా.. అంతే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. దొంగతనానికి పాల్పడి... ఇంట్లోని బంగారం, ఇతర విలువైన వస్తువులు అపహరిస్తాడు. గత పదేళ్లుగా చోరీ చేసిన కోటి రూపాయలకు పైగా విలువైన ఆభరణాలన్నీ.. ఇంట్లోనే దాచుకున్నాడు. ఇప్పటికీ ఆ ఆభరణాలు... ఇప్పుడే నగల దుకాణంలో కొనుగోలు చేసినట్టు ఉన్నాయంటే వాటిని ఏ విధంగా భద్రపరిచాడో అర్థమవుతోంది.
తాళం వేసి ఉన్న ఇళ్లే అతని లక్ష్యం.. క్షణాల్లో తాళాలు పగలగొట్టి ఇంటిలోని బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు అపహరిస్తాడు ఆ చోర శిఖామణి. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా.. అయితే అతనికి నిద్రలో ఫలానా ఇంటిలో చోరీ చేసినట్టు కల వచ్చిందా.. అంతే సంగతులు ఆ ఇంటికి కన్నం వేస్తాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన అంబేడ్కర్.. హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై ఉంటూ చోరీలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు. గతంలో కార్ఖానా, లాలాగూడ, పోలీస్‌స్టేషన్‌ల పరిధితో పాటు... కర్ణాటకలోనూ దొంగతనాల కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లినా దొంగతనాలు చేయడం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. 2016 నుంచి 2022 వరకు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 43 ఇళ్లలో చోరీ చేశాడు. చోరీ చేసిన సొత్తంతా పిడుగురాళ్లలో తన ఇంట్లో భద్రపరిచాడు. పదేళ్లుగా దొంగతనాలు చేసిన బంగారం, వెండిని కవర్లలో చుట్టి భద్రపరిచాడు.
వనస్థలిపురంలోని వైదేహినగర్‌లో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అంబేడ్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను దొంగతనాలు చేస్తానని.. చోరీ చేసినట్టు కల వస్తే.. దొంగతనం చేస్తానని తెలిపాడు. పోలీసులు సదరు దొంగ ఇంట్లో భద్రపరచిన రెండు కిలోలకు పైగా బంగారం, 10.2 కిలోల వెండిని చూసి అవాక్కయ్యారు. 1.3 కోట్ల రూపాయల విలువైన బంగారం... వెండితో పాటు 18 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బాధితులు మాత్రం తమ ఆభరణాలు చెక్కు చెదరకుండా తిరిగి లభించాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా దొంగలించిన బంగారం, వెండి ఆభరణాలను దొంగ సురక్షితంగా భద్రపరచడంతో... పోలీసులు, బాధితులు విస్తుపోయారు.