ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం ముత్యాలంపాడు వద్ద ఉన్న బుగ్గవాగులో ఓ తల్లి..బిడ్డ మృతదేహం లభ్యమయ్యాయి. అంతకు ముందు రోజు మరో పసికందు మృతదేహం తాళ్లపల్లి కుడికాల్వలోని సూరమ్మ చెరువులో లభ్యమైంది. మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలం, యాప్రాల్ గ్రామానికి చెందిన చిట్టియార్ రేఖ (32) ఓ షాపింగ్‌మాల్‌లో పని చేసేది. భర్త శ్రీనివాసరావు కూరగాయల విక్రేత. ఈ కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. స్వల్ప వివాదం కూడా జరిగింది. తర్వాత ఏం జరిగిందో ఏమో.. రేఖ తన నాలుగేళ్ల రోష్ని దేవాన్ష్, రెండేళ్ల ధనుష్‌ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈనెల 24న అల్వాల్ పోలీసుస్టేషన్‌లో వీరి అదృశ్యంపై కేసు నమోదైంది. పోలీసులు వారి ఆచూకీ కోసం వెదికారు..
రెండేళ్ల బాలుడు కుడికాల్వలో మృతదేహమై..
మాచర్ల మండలం తాళ్లపల్లిలోని సాగర్ కుడికాల్వలోని సూరమ్మ చెరువులో మంగళవారం ఓ బాలుని మృతదేహం అక్కడున్న వారికి కనిపించింది. విషయాన్ని విజయపురిసౌత్ పోలీసులకు చేరవేశారు. బాలుని ఆచూకీ కోసం ఆరా తీసిన సాగర్ పోలీసులు.. అప్పటికే కొన్ని మిస్సింగ్ కేసుల వివరాలు తీసుకొని యాప్రాల్ గ్రామంలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని చూసి ధనూష్‌గా గుర్తించారు. దీంతో తల్లి, మరో బిడ్డ కోసం వెదుకులాట ప్రారంభించారు. మాచర్ల మండలం ముత్యాలంపాడు సమీపంలోని బుగ్గవాగులో తల్లి రేఖ, దేవాన్ష్ మృతదేహాలు కనిపించడంతో ఎస్‌ఐ ఉదయలక్ష్మీ సమాచారం సాగర్ పోలీసులకు, మృతుల బంధువులకు చేరవేశారు. మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో ఇంతటి అఘాయిత్యానికి రేఖ పూనుకుందా.. లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నగరంలో కష్టంగా మారుతున్న కరోనా మృతుల అంత్యక్రియలు