మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో అపహరణకు గరైన ఓ బాలిక (12) కేసును.. పోలీసులు ఛేదించారు. 8 రోజుల క్రితం.. కూలీ పనులు చేస్తున్న తల్లిదండ్రులను చూసేందుకు వెళ్లి.. బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బాలిక ఈ నెల 12న.. డోకూరు గ్రామం శివారులోని ఓ కోళ్ల ఫారం దగ్గర కూలీ పనులు చేస్తున్న తల్లిదండ్రులను కలిసేందుకు వెళ్లి అదృశ్యమైంది. కూమార్తె ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. ఈనెల 16న వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కోళ్ల ఫారం దగ్గర పర్యవేక్షణ చేసే సాజిద్(42)ను.. అనుమానించి వేట మొదలు పెట్టారు.
బాలికను వివిధ ప్రాంతాలకు తరలిస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితుడు.. పోలీసులు, తన గురించి వెతుకుతున్నారన్న సమాచారం తెలుసుకుని భయాందోళనకు గురయ్యాడు. నవాబ్ పేటలోని ఓ ఫంక్షన్ హాల్ దగ్గర వదిలిపెట్టి పరారయ్యాడు.
పోలీసులు.. బాధితురాలికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక సంరక్షణార్థం స్టేట్ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సాజిద్ కోసం.. గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడికి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... స్టేట్ హోమ్ తరలింపు