Murder Case Solved: ఈ నెల 6న జరిగిన పన్నెండేళ్ల బాలుడి హత్య కేసును కామారెడ్డి జిల్లా పోలీసులు చేధించారు. హత్య జరిగిన రెండు రోజుల్లోనే నిందితున్ని పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ సమీపంలోని ఓ పంటపొలంలో అక్కంపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు సురేష్.. ఆదివారం(ఫిబ్రవరి 6న) హత్యకు గురయ్యాడు. మొదట అనుమానస్పద మృతిగా భావించిన పోలీసులు శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనుమానం వచ్చిన బాలుడే..
దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. హత్య జరిగిన రోజు.. అదే గ్రామానికే చెందిన మరో బాలుడు(17 ఏళ్లు) తన సైకిల్‌పై సురేష్‌ను తీసుకెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. సదరు బాలున్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. సురేష్‌ను తానే చంపినట్లుగా బాలుడు(నిందితుడు) ఒప్పుకున్నాడు.
రహస్యాన్ని బయటకు చెప్తాడని..
నిందితునికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కాస్తా సురేష్‌కు తెలిసింది. తన బండారాన్ని ఎక్కడ బయటకు చెప్తాడోనని భయపడ్డ నిందితుడు సురేష్‌ను హతమార్చాలనుకున్నాడు. బయటకు వెళ్దామని చెప్పి.. సురేష్‌ను తన సైకిల్ మీద పొలాల్లోకి తీసుకెళ్లాడు. నిర్మానుష్యం ఉన్న ప్రదేశంలో.. తనతో తెచ్చుకున్న కత్తితో సురేష్‌ను పదిసార్లు పొడిచాడు. చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత తన సైకిల్‌ను పంట పొలంలో దాచిపెట్టి పరారయ్యాడు. హత్య చేసిన బాలున్ని పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు సైకిల్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: