సికింద్రాబాద్ పికెట్ ప్రాంతానికి చెందిన కిషన్ నారాయణ్ (88) విశ్రాంత శాస్త్రవేత్త. ప్రస్తుతం ఆయన తన సతీమణితో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వృద్ధాప్యం కారణంగా రెండు సంవత్సరాల కిందట తుకారాంగేట్ వెంకటనగర్‌కు చెందిన గుమ్మడి భాగ్యలక్ష్మి అనే మహిళను సంరక్షకురాలిగా పనిలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి ఆమె వృద్ధుల బాగోగులను చూసుకుంటూ... ఎంతో నమ్మకంగా ఉంటున్నట్టు నటించింది. అదును దొరికినప్పుడల్లా ఇంట్లో వస్తువులను దొంగిలించి... ఏమీ ఎరగనట్టు తిరిగి ఎప్పటిలాగే పనికి వచ్చేది.
గత నెల 28న కిషన్ నారాయణ్ బీరువా తెరిచి చూసేసరికి అందులో దాచిన సుమారు రూ.17 వేలు కనిపించలేదు. అనుమానం రావడంతో స్థానికంగా ఉంటున్న తన మనుమడు అవినాశ్‌ను పిలిచి జరిగిన విషయాన్ని చెప్పాడు. మరోసారి బీరువాను క్షుణ్ణంగా పరిశీలించగా... భద్రపరిచిన 23 తులాల బంగారు ఆభరణాలు సైతం కనిపించకుండా పోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మారేడ్‌పల్లి పోలీసులు తెలిపారు. దర్యాప్తులో బంగారు ఆభరణాలను భాగ్యలక్ష్మి దొంగతనం చేసినట్లు వెల్లడించారు. నిందితురాలి నుంచి సుమారు రూ.9 లక్షలు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సునీల్ నాయక్ ఆత్మహత్య రాష్ట్ర ప్రభుత్వ హత్యే: బండి సంజయ్