ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. గతనెల 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద ఎదురు కాల్పుల ఘటనను నిరసిస్తూ మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ గురువారం ఏవోబీ బంద్(AOB Bandh)కు పిలుపునివ్వడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశమున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి బంద్‌కు సహకరించవద్దని గ్రామస్థులను కోరుతున్నారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలతో పాటు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఒడిశాలో బీఎస్‌ఎఫ్, ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాలు, ఆంధ్రాలో గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. తీగలమెట్టలో ఎదురుకాల్పులు జరిగిన సంఘటన స్థలం వద్ద సుమారు 20 కిట్ బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో మావోయిస్టులకు సంబంధించి కీలక సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. మావోయిస్టు అగ్ర నాయకులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, అరుణ, కాకూరి పండన్న అలియాస్ జగన్‌లు ఇక్కడ సంచరిస్తున్నారనే అనుమానాలతో ఏవోబీలో పోలీసు అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
విస్తృతంగా తనిఖీలు
ముంచంగిపుట్టు గ్రామీణం, కొయ్యూరు, జి.మాడుగుల, గూడెంకొత్తవీధి సరిహద్దు కూడళ్లు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ముఖ్యమైన మార్గాల్లో ఉన్న కల్వర్టులు, వంతెనలను సీఆర్‌పీఎఫ్ బలగాలు, బాంబు నిర్వీర్య బృందాలు జల్లెడ పడుతున్నాయి. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా ఆశ్రయం కల్పించవద్దని, అనుమానంతో ఎవరు సంచరించినా తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
బంద్ సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులను మైదాన ప్రాంతాలకు వెళ్లిపోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిర్మాణ పనులు నిర్వహిస్తున్న యంత్ర సామగ్రిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. రాత్రిపూట బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేయగా.. నైట్‌హాల్ట్ బస్సులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంతో పాటు జోలాపుట్టు, ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్, వనుగుమ్మ, రంగబయలు తదితర మార్గాల్లో గురువారం శిక్షణ ఎస్సై శంకరరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కొయ్యూరు సీఐ స్వామినాయుడు, ఎస్సై నాగేంద్ర ఆధ్వర్యంలో చింతవానిపాలెం ఘాట్‌రోడ్డుతోపాటు మండలంలోని ముఖ్య కూడళ్లలో తనిఖీలు చేశారు. జి.మాడుగుల, నుర్మతి అవుట్ పోస్టు పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జి.మాడుగుల, నుర్మతి ఎస్సైలు ఉపేంద్ర, నజీర్, శ్రీనివాసరావు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తెలిపారు. గూడెంకొత్తవీధి మండలంలో సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో బాంబ్‌స్క్వాడ్ బృందాలు పి.కొత్తూరు-కొత్తపల్లి రహదారిలో తనిఖీలు చేపట్టాయి.
ఇదీ చదవండి: Pillalamarri: పిల్లలమర్రికి పురావస్తు పార్కు.. రెండెకరాల్లో అభివృద్ధి