ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజలకు ఒరిగేది ఏం లేదని.. ఇటువంటి బూటకపు ఎన్నికల్లో పాల్గొనొద్దని.. మావోయిస్టు పార్టీ విశాఖ-ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ అన్నారు. ఎన్నికలు ముందు బాక్సైట్ జీవో నెం.97 రద్దు చేశామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం... మాకవరపాలెంలో అన్రాక్ కంపెనీకి బాక్సైట్ సరఫరా చేయడానికి జీవో నెం. 89ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపాధ్యాయులను భర్తీ చేసే ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టులో రద్దు చేయగా, దీనిపై రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఇంతరకూ రివ్యూ పిటీషన్ వేయలేదని ఆరోపించారు. ఏపీలో జగన్ పాలన ఫ్యాక్షనిస్టు నియంత్ర పాలనలా ఉందని, ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం చివరకు రాజ్యాంగం, నాయస్థానాన్ని ధిక్కరిస్తూ ఉందని అరుణ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మూడు రాజధానుల నాటకాలు ఆడుతుందని ప్రకటనలో మండిపడ్డారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై రాళ్ల దాడి