Suryapet Extra Marital Affair Murder : భార్యతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దమ్ము చక్రాలతో తొక్కించి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతమిది. ఈ పాశవిక ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగుచూసింది.
ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
Extra Marital Affair Murder in Suryapet : పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాతుక మహేశ్(30) రైతు. మంగళవారం గూబగుట్టకు వెళ్లే దారిలో తన అన్న నాగరాజు పొలంలో నాట్లు వేసే పనిలో మహేశ్ సైతం పాల్గొన్నాడు. నాట్లు ముగిసిన తర్వాత కూలీలను స్వగ్రామంలో దింపడానికి నాగరాజు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. తర్వాత మహేశ్ ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ చోదకుడు ఒకరు పొలాన్ని దమ్ము చేసి అదే దారిలో ఇంటి వెళ్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్న మహేశ్‌ను అతడు గమనించాడు. పాత కక్షల నేపథ్యంలో ట్రాక్టర్‌తో మహేశ్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో మహేశ్ ద్విచక్రవాహనంతో సహ పక్కనే ఉన్న దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. వెంటనే ట్రాక్టర్‌ను అతనిపై నుంచి తొక్కించడంతో మహేశ్ అక్కడికక్కడే మరణించాడు. ఆ వ్యక్తి ట్రాక్టర్‌ను ఘటనాస్థలానికి కొద్దిదూరంలో వదిలేసి పారిపోయాడు.
అందుకే చంపాడు..
Murder Due to Extra Marital Affair in Suryapet : బుధవారం ఉదయం అటువైపు వచ్చిన రైతులు గమనించి.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసుల విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాక్టర్ డ్రైవర్ భార్యకు మహేశ్‌తో వివాహేతర సంబంధం ఉందని.. ఇదే విషయంపై నాలుగేళ్ల కిందట గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించారని తెలిసింది. ఆ తర్వాత సమస్య సద్దుమణిగినా.. ఇటీవల మళ్లీ తన భార్య జోలికి మహేశ్ వస్తున్నాడనే అనుమానం పెంచుకున్న సదరు వ్యక్తి.. ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు.