తన కోరిక తీర్చనందుకు వృద్ధురాలిపై ఓ వ్యక్తి కిరాతంగా దాడి చేసి హత్య చేశాడు ఓ కామాంధుడు. ఆపై పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోయాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని బందావారివీధిలో కర్నాటి విజయలక్ష్మి (61) అనే వృద్ధురాలు.. భర్త మరణంతో కొన్నాళ్లుగా ఒంటరిగా జీవించింది. తులాబంధు సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులు ఆమె ఇంటి సమీపంలోనే నివసిస్తున్నారు. వీరు ముగ్గురూ తరచూ చరవాణిలో మాట్లాడుకుంటుండేవారు.
ఈ క్రమంలో.. గత నెల 11వ తేదీ రాత్రి వృద్ధురాలి ఇంటికి సాంబశివరావు వెళ్లాడు. తన కోరిక తీర్చాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. వృద్ధురాలు ప్రతిఘటించటం వల్ల.. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం మంచినీళ్లు కావాలని సాంబశివరావు విజయలక్ష్మిని అడిగాడు. తెచ్చేందుకు వంట గదిలోకి వెళ్లిన సమయంలో వృద్ధురాలిపై కోపంతో సాంబశివరావు పదే పదే దాడి చేశాడు. తీవ్ర గాయాలతో.. విజయలక్ష్మి స్పృహ తప్పిపడిపోయింది. హతమార్చాలని నిర్ణయించుకున్న సాంబశివరావు... విజయలక్ష్మి గొంతు నొక్కి ప్రాణాలు తీశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ విషయం గత నెల 15న వెలుగు చూడగా.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం ఎప్పటికైనా బయటపడుతుందనే భయంతో.. తానే వృద్ధురాలిని అకారణంగా హతమార్చాననే పశ్చాత్తాపంతో సాంబశివరావు తొలుత రెవెన్యూ అధికారుల సమక్షంలో లొంగిపోయాడు. అనంతరం వాళ్లు నిందితున్ని పోలీసులకు అప్పగించారు.