కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పీఎస్ పరిధిలోని పాపారాయుడు నగర్లో నివసించే సుధాకర్ తన కుటుంబంతో సహా శ్రీఉదయ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్లో నివసిస్తున్నాడు. వీరి కుమారుడు వినోద్(36) వ్యాపారం చేసి నష్టాల్లో కూరుకుపోయాడు. దానికి తోడు భార్యతో ఏర్పడిన విబేధాలతో, ఆమె అతడిని వదిలేసి వెళ్లటంతో మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చిన వినోద్, తల్లితో వాగ్వాదానికి పాల్పడి, ఆత్మహత్య చేసుకుంటానని తల్లికి చెప్పి తన గదిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
మంటలు ఇంట్లో వ్యాపించటంతో ఇంట్లో వారు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించగా.. ఇంట్లో ఉన్న టపాసులకు నిప్పంటుకుంది. మంటలు ఫ్లాట్ మొత్తం వ్యాపించటం వల్ల ఇంట్లో వారు బయటకు వచ్చి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. అప్పటికే వినోద్ అగ్నికి ఆహుతయ్యాడని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Accident: ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. ఇద్దరు మృతి