ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యంలో పాగా వేసిన ముఠాలు పెద్ద ఎత్తున ద్రవరూప గంజాయి (హషిష్ ఆయిల్) తయారు చేయిస్తున్నాయి. ప్రత్యేక యంత్రాలతో దీని తయారీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. పొడి గంజాయితో పోలిస్తే దీని ధర 20-30 రెట్లు అధికంగా ఉండటం, రవాణా సులువు కావడం, పోలీసులకు చిక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో మత్తు ముఠాలు విస్తృతంగా మార్కెట్‌లోకి తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మాదకద్రవ్యాల సరఫరాదారులు విశాఖలో కొని, తరలిస్తూ అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాపారం తారస్థాయికి చేరింది.
మన్యంలో లీటరు రూ.లక్ష... ఇతర రాష్ట్రాల్లో రూ.5 లక్షలు
ఏపీ విశాఖ మన్యంలో తయారుచేస్తున్న ద్రవరూప గంజాయిని మత్తుముఠాలు లీటరు రూ.లక్షకు విక్రయిస్తున్నాయి. దాన్ని సరఫరాదారులు 20, 30 మిల్లీలీటర్ల సీసాల్లో నింపి ఒక్కోటి రూ.3-5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. దేశంలోని పలు నగరాలకు తరలించి విద్యార్థులు, ఐటీ, ఇతరత్రా అధికాదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకుని వీటిని అమ్ముతున్నారు. దీని తయారీ వెనుక కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన మత్తు ముఠాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. అందుకు అవసరమైన యంత్రాలు, రసాయన పదార్థాల్ని ఇప్పటికే మన్యానికి తరలించాయి. పచ్చి గంజాయి ఆకులు, పువ్వుల నుంచి ద్రవరూప గంజాయిని ఎలా తయారు చేయాలనే దానిపై నిపుణులతో కొందరు గిరిజనులకు శిక్షణ ఇప్పించాయి. వారు మరికొందరికి నేర్పడంతో, ఇది కుటీర పరిశ్రమలా మారిపోయింది.
తేనె, ఆయుర్వేద ఔషధాల ముసుగులో
పోలీసులకు దొరక్కుండా.. ద్రవరూప గంజాయిని తేనె సీసాలు, ఆయర్వేద ఔషధాల కోసం వినియోగించే డబ్బాల్లో నింపి రవాణా, విక్రయాలు చేస్తున్నారు. మరికొందరైతే బిర్యానీ ఫుడ్ రంగుల డబ్బాల్లో నిల్వచేసి రవాణా చేస్తున్నారు. హుక్కా పీల్చేటప్పుడు, సిగరెట్ తాగేటప్పుడు అందులో ఈ ద్రవరూప గంజాయి రెండు, మూడు చుక్కలు వేస్తే ఎక్కువ కిక్కు వస్తుందని చెబుతున్నారు. సిగరెట్ తాగే విద్యార్థులు, యువకుల్ని ఎంపిక చేసుకుని వారికి దీన్ని అలవాటు చేస్తున్నారు.
25-30 కిలోల గంజాయితో లీటరు ద్రవం
గంజాయి ఆకుల్ని యంత్రాల్లో వేసి దాన్నుంచి వచ్చే రసాన్ని ఉడికించి, అందులో కొన్ని రసాయనాల్ని నిర్ణీత మోతాదులో కలిపి ద్రవరూప గంజాయి తయారుచేస్తున్నారు. ఒక లీటరు ద్రవరూప గంజాయి తయారీకి కనీసం 25-30 కిలోల పచ్చి ఆకులు వినియోగిస్తారు. లీటరు ధర రూ.లక్షపైనే ఉంటోంది. ఖరీదుతో పాటు కిక్కు ఎక్కువేనని చెప్పి దీన్ని అమ్ముతున్నారు.
విశాఖ మన్యం నుంచి వడోదర వరకూ
- గుంటూరు అర్బన్ పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద లీటరు ద్రవరూప గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని వడోదరకు తరలించేందుకు విశాఖ మన్యం నుంచి దీన్ని తెచ్చినట్లు చెప్పారు.
- ద్రవరూప గంజాయి తయారీ, రవాణా ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు కేరళవారే.
- గతేడాది డిసెంబరులో విశాఖ జిల్లా పెందుర్తిలోని ఒక అపార్టుమెంటులో ఇద్దరు మహిళలు గంజాయితో పోలీసులకు చిక్కారు.
- విశాఖ నుంచి హైదరాబాద్‌కు దీనిని తరలిస్తుండగా మాడుగులలో పట్టుకుని, ఇద్దరు తమిళులను అరెస్టు చేశారు.
- కడప జిల్లాలో ద్రవరూప గంజాయిని విద్యార్థులకు అమ్మే ఇద్దరు గత నెలలో పట్టుబడ్డారు. విశాఖ మన్యం నుంచే తెచ్చినట్లు తేలింది.
ఇదీ చదవండి: ముంద్రా డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం- దిల్లీలో ఎన్ఐఏ సోదాలు