హైదరాబాద్‌లోని పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 14 లక్షల 36 వేల విలువ చేసే 18 తులాల బంగారు ఆభరణాలు, కిలోకు పైగా వెండి వస్తువులు, ఒక ల్యాప్‌టాప్, ఓ ట్యాబ్, రెండు ద్విచక్ర వాహనాలు, 5 గడియారాలు, ఓ టీవీ, కెమెరా స్వాధీనం చేసుకున్నామని సీసీఎస్ పోలీసులు తెలిపారు.
రోజువారి తనిఖీల్లో భాగంగా ఎల్బీనగర్‌లో వాహనాల తనఖీ చేపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు కిషోర్ చౌదరి, అర్జున్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఆదిభట్ల, మీర్‌పేట పోలీసు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌లోనూ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు