హైదరాబాద్ వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులోని బాత్రూమ్లో రహస్య చిత్రీకరణ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘనకార్యంలో ప్రధాన నిందితునిగా గుర్తించిన మైనర్ బాలున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలుడికి ఇంకో రెండు వారాల్లో మైనారిటీ తీరుతుందని వెల్లడించారు. నిందితుడిది సైకో మనస్తత్వమని... ప్రస్తుతం అతడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
ఆ ఫుడ్ కోర్టులో ఏం జరిగిందంటే...
జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్-10లోని ప్రధాన ప్రాంతం కావడం... వన్ డ్రైవ్ ఫుడ్ కోర్టులో ఉన్న పలు రెస్టారెంట్లకు అధిక సంఖ్యలో యువతీ యువకులు వస్తుండటం వల్ల ఈ ఘటన ఆందోళన కలిగించింది. భువనగిరికి చెందిన నిందితుడు ఆరు నెలల క్రితమే ఫుడ్ కోర్ట్‌లో హౌస్ కీపింగ్ బాయ్‌గా చేరాడు. వచ్చిన జీతంతో వారం క్రితమే రూ.14 వేలు పెట్టి ఫోన్ కొన్నాడు. యువతులు ఎక్కువగా ఫుడ్ కోర్ట్‌కు వస్తుండటాన్ని గమనించిన బాలుని మదిలో తప్పుడు ఆలోచన మొలిచింది. వెంటనే.. ఆ చరవాణిని బాత్రూమ్లో పెట్టి వీడియో రికార్డ్ చేయాలనుకున్నాడు. 21 తేది రాత్రి పూట బాత్రూమ్లో చరవాణి పెట్టేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మళ్లీ 22న మధ్యాహ్నం సెల్‌ఫోన్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి బాత్రూమ్లో సీలింగ్‌కు లైట్ కోసం తీసిన రంధ్రంలో పెట్టాడు. అప్పుడప్పుడూ బాత్రూమ్ శుభ్రం చేస్తున్నట్లు వెళ్లి.. చరవాణీని తనిఖీ చేసుకున్నాడు.
యువతికి వచ్చిన అనుమానంతో...
బుధవారం మధ్యహ్నం ఫుడ్ కోర్టుకు వచ్చిన ఓ యువతికి అనుమానం వచ్చి పరిశీలించగా.. ఈ విషయం వెలుగు చూసింది. బాత్రూమ్లోని సెల్‌ఫోన్ కెమెరాను గుర్తించిన యువతి.. బయటకు వచ్చి ఆమె స్నేహితులకు ఈ విషయం చెప్పింది. ఘటనపై ఫుడ్ కోర్ట్ యజమానులకు చెప్పి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు... నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే సెల్‌ఫోన్ అమర్చాడని.. రహస్య చిత్రీకరణకు కొత్త ఫోన్ వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలుని నుంచి చరవాణి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐపీసీ 354 సీ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇతరుల పాత్రపై ఆరా..
సీసీ కెమెరా పుటేజ్, హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఫుడ్ కోర్టు యజమాని, సెక్షన్ ఇంఛార్జీని ప్రశ్నించనున్నట్లు తెలిపారు. రహస్య చిత్రీకరణలో ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితుడు ఒక్కడే ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫుడ్ కోర్టు యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. దాని ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. రహస్య చిత్రీకరణ సమయంలో ఫోన్‌లో సిమ్‌కార్డు లేదని... ఫోన్ నుంచి ఎవరికీ వీడియోలు పంపినట్లు గుర్తించలేదని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. రికార్డైన వీడియోలతో నిందితుడు ఎవరినైనా బ్లాక్‌మెయిల్ చేశాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. దీని వెనుక ఇతరుల పాత్ర ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.
బయటికి రాకుండా మధ్యవర్తి డీల్..
కేసు దర్యాప్తు సమయంలో కేశవ్ అనే పేరు అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన తర్వాత పోలీసు ఫిర్యాదు వరకూ.. వెళ్లకుండా చూసుకుంటానని చెప్పి కేశవ్ అనే వ్యక్తి తమను రూ.15 లక్షలు డిమాండ్ చేశాడని ఫుడ్ కోర్ట్ యజమాని చైతన్య తెలిపారు. బాత్రూంలో సెల్‌ఫోన్ గుర్తించిన యువతి ఆందోళన చేసిన సమయంలో... కేశవ్ అనే వ్యక్తి అక్కడే ఉన్నాడని తెలిపారు. అనంతరం.. అతడి వెంట వచ్చిన యువతిని వదిలిపెట్టేసి మళ్లీ ఫుడ్‌కోర్టుకు వచ్చాడని వివరించారు. యువతి తనకు పరిచయమేనని... కేసు పెట్టకుండా మేనేజ్ చేయాలంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చైతన్య పేర్కొన్నారు. యువతికి ఈ విషయాన్ని తెలిపానని... ఈ విషయం తెలిసిన వెంటనే జరిగిన ఘటనపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేశవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారించాలని పోలీసులను చైతన్య కోరారు. రహస్య చిత్రీకరణకు సంబంధించి ఘటనపై తాము పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని యజమాని స్పష్టం చేశారు.
పోలీసుల విచారణలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పాడని పోలీసులు తెలిపారు. సెల్ఫోన్లో 15 నుంచి 20 మంది యువతుల వీడియోలు రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చదవండి : తుపాకీతో బెదిరించి.. బాలికపై గ్యాంగ్‌రేప్