వ్యవసాయ బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ రైతు పరిస్థితి.. ప్రస్తుతం విషమంగా ఉంది. బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలంటూ బంధువులు.. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆఫీస్ లోనికి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించిన గ్రామస్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
నిబంధనల ప్రకారం బోరుబావి.. బోరుబావికి మధ్య 100 మీటర్ల దూరం పాటించకుండా రమేశ్ అనే రైతు బోరు వేశాడని.. అతని వ్యవసాయ క్షేత్రం పక్కనే ఉన్న మరో అన్నదాత ఫిర్యాదు చేశాడు. తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. మనస్తాపానికి గురైన అతను.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని ముందుగా హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
సమాచారం ఇవ్వలేదు:
ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బోర్ను సీజ్ చేశారని రమేశ్ బంధువులు ఆరోపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి చికిత్స అందించడానికి తమ వద్ద డబ్బులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స అందించేలా రెవెన్యూ అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ.. కార్యాలయం ఎదుటే బైఠాయించి నిరసన తెలిపారు.
రంగంలోకి దిగిన ఎస్సై శ్రీధర్.. రైతు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పడంతో.. వారు ఆందోళన విరమించారు. ఈ విషయమై ఎస్సై.. ఎమ్మార్వో రెహమాన్‌ను వివరణ కోరారు. సంవత్సరం క్రితమే రైతుకు సూచించినా.. అతను పట్టించుకోలేదని తహసీల్దార్ బదులిచ్చారు. వాల్టా చట్టం నిబంధనల ప్రకారమే.. బోరును సీజ్ చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యే దానం నాగేందర్ వియ్యంకుడిపై ఆగంతకుల దాడి