హాస్టల్లో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన బాలరాజు (17)... మహబూబ్‌నగర్‌లోని శ్రద్ధ జూనియర్ కళాశాలలో చదవుతున్నాడు. ప్రభుత్వం కళాశాలలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వగా... ఈ నెల 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో గత పది రోజుల కిందట కళాశాలకు వచ్చి చేరిన విద్యార్థి... అక్కడే హస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నాడు.
కళాశాల పై అంతస్తులోని తరగతి గదిలో ఈరోజు ఉదయం బాలరాజు ఆత్మహత్య చేసుకున్నట్టు యాజమాన్యం పేర్కొంది. బాలరాజుకు తీవ్ర జ్వరంగా ఉందని.. చికిత్స నిమిత్తం వెంటనే తీసుకెళ్లాలని యాజమాన్యం తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందని మృతుడి చిన్నాన్న వాపోయాడు. చదువులో చురుకుగా ఉండే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత అవసరం లేదని.. జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాడు.
ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా కళాశాలలో హస్టళ్లు నడుపుతున్నారని... విద్యార్థి ఆత్మహత్య ఘటనపై విచారణ చేపట్టాలని పలు విద్యార్థి సంఘాలు ఇంటర్మీడియట్ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.