Hawala money seized in Hyderabad: హైదరాబాద్‌లో హవాలా నగదుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలతో కోట్లలో నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. 10 రోజుల వ్యవధిలో ఇప్పటివరకు దాదాపు రూ.11 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లో మరో 2 కోట్ల రూపాయల హవాలా నగదును పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు రోడ్ నెంబర్ 12లో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. అనుమతి పత్రాల్లేకుండా అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆకాశ్ కాంతి కొరియర్, పార్శిల్ సర్వీస్ గుజరాత్ రాష్ట్ర యజమానికి సంబంధించిన సొమ్ముగా గుర్తించారు. పలువురు నిందితులపై కేసులు నమోదు చేశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పోలీసులు మరింత దృష్టి సారించారు.
గత నెల 29న మాసబ్‌ట్యాంక్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి వద్ద కోటి 24లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పాత సామాను సేకరించే వ్యాపారం చేసే ఉత్తరప్రదేశ్ మీరట్‌కు చెందిన షోయబ్ మాలిక్... బంధువు కామిల్ సూచన మేరకు హవాలా డబ్బు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. శుక్రవారం రాత్రి చాంద్రాయణగుట్ట కూడలి వద్ద రెండు కార్లలో తరలిస్తున్న 79 లక్షల రూపాయల హవాలా డబ్బును పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అదే రోజు జూబ్లీహిల్స్ పరిధిలో కార్తికేయ అనే వ్యక్తి నుంచి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లో కారులో తరలిస్తున్న రెండున్నర కోట్ల రూపాయలను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు హవాలా డబ్బుగా గుర్తించి సీజ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
నిన్న గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారియట్ హోటల్ వద్ద చేపట్టిన తనిఖీల్లో మూడున్నర కోట్ల డబ్బు పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో... ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
వరుసగా పది రోజుల నుంచి కోట్లలో డబ్బు పట్టుబడుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. డబ్బును ఎక్కడ్నుంచి తీసుకువస్తున్నారు...? ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి భారీగా సొమ్ము తరలిస్తుండటంపైనా దృష్టి సారించారు.
ఇవీ చదవండి: