Illegal loans in Utkoor SBI: ఆధార్ కార్డులో ఎండీ నజీరాబేగం పేరు ఉంది. ఆమెది మక్తల్ మండలంలోని మంథన్‌గోడ్ గ్రామం. నజీరాబేగం పేరుతో పట్టాదారు పాసుపుస్తకంలో ఆమె పేరుతోపాటు సామాజిక వర్గం, గ్రామం, మండలం పేర్లు ఉన్నాయి. అయితే ఈ పాసు పుస్తకంలో ఉన్న ఫొటో మాత్రం నజీరాబేగంది కాదు. అందులో ఉన్న ఫొటో మంథన్‌గోడ్ గ్రామానికి చెందిన ముగ్దూంబీది. నాలుగు రోజుల కిందట బ్యాంకు అధికారులు గ్రామానికి వెళ్లి... ఫొటోలో ఉన్న ముగ్దూంబీ ఇంటికి వెళ్లి రుణం చెల్లించాలని చెప్పే సరికి అసలు విషయం బయటపడింది. ఈ పాసు పుస్తకంలో సర్వే నంబరు 693/3లో నాలుగు ఎకరాల స్థలం ఉన్నట్లు ఉంది. ఈ పాసు పుస్తకం మీద ఉన్న ఫొటో తనదే కానీ, పాసు పుస్తకంలో ఉన్న వివరాలు తనవి కాదని వెల్లడించింది. అసలు తాను ఇప్పటి వరకు రుణమే తీసుకోలేదని చెప్పింది. వాస్తవానికి కూడా బాధితురాలు ముగ్దూంబీ పేరు మీద అసలు భూమే లేదు.
పేరు ఒకరిది.. ఫొటో మరొకరిది..
ఈ పాసు పుస్తకంలో దాసరి వెంకటేష్, సంగంబండ గ్రామం, మక్తల్ మండలం అని ఉంది. ఈ పాసు పుస్తకంలో పేరు ఉన్న వ్యక్తి మంథన్‌గోడులో ఉంటారు. పాసు పుస్తకంలో మాత్రం సంగంబండ అని ఉంది. ఇదే పాసు పుస్తకంలో ఉన్న ఫొటో మాత్రం దాసరి వెంకటేష్ అనే వ్యక్తిది కాదు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు మౌలాలి. ఆయన ఉండేది మంథన్‌గౌడ్. ఈ పాసు పుస్తకంలో చూపెట్టిన సర్వే నంబరు 184/ఈలో మాత్రం మరో వ్యక్తి పేరు ఉంది.
నకిలీ పాసు పుస్తకాల ముఠా
ఈ విధంగా మక్తల్ కేంద్రంగా నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాల ముఠా వ్యవహారం డొంక కదులుతోంది.. ఉట్కూరు ఎస్‌బీఐలో రైతుల పేరు మార్చి రుణాలు పొందిన వ్యవహారం ఇటీవలె బయటపడింది.. మక్తల్ పట్టణంలో ఓ వ్యక్తి స్టాంపులు, రబ్బర్లు, సర్టిఫికెట్లు తయారు చేసే యంత్రాలను సమకూర్చుకుని ఈ దందా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యక్తితో 10 మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారని తెలుస్తోంది. వారి ద్వారానే నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో సమర్పించి బ్యాంకులను మోసం చేస్తున్నట్లు సమాచారం. నకిలీ పట్టాలు తయారు చేసి కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో మక్తల్ తహసీల్దారు కార్యాలయంలో తిష్ఠ వేసి అనధికారికంగా విధులు నిర్వహించిన వ్యక్తే ఈ దందాకు మూలబిందువు అన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనను తహసీల్దారు కార్యాలయం నుంచి తొలగించడంతో నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాల దందాను కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆ వ్యక్తి గురించి తెలిసినా ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదంటూ ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఉట్కూరు ఎస్‌బీఐ బ్యాంకులో పెట్టిన నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాల పత్రాలు కూడా ఈ వ్యక్తి ద్వారానే తయారయినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
వందల్లో బాధితులు..
ఉట్కూరు బ్యాంకు ద్వారా నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో 2017 నుంచి రుణాలు తీసుకున్నట్లు ఉంది. ప్రతి ఒక్కరి పేరు మీద రూ.30 వేల నుంచి 50వేల మధ్య రుణాలు తీసుకున్నారు. ఈ నాలుగేళ్లలో వడ్డీతో సహా కలిపి ఈ రుణాలు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు చేరాయి. నాలుగేళ్లుగా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు గ్రామాల బాట పట్టగా తాము అసలు రుణమే తీసుకోలేదని వారు చెప్పారు. దీంతో బ్యాంకు అధికారులు నాలుగు రోజుల కిందట మక్తల్ తహసీల్దారు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో బ్యాంకు రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని, తమ వద్ద తనఖా కింద ఉంచిన పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డులు తమవి కాదని, అందులో తమ పేర్లు పెట్టారని బాధితులు చెబుతున్నారని తహసీల్దారుకు వివరించగా... ఆయన బ్యాంకు సిబ్బందికి సాయంగా వీఆర్‌ఏను పంపించారు. బ్యాంకర్ల వద్ద ఉన్న పత్రాల్లోని ఫొటోల ఆధారంగా ఇళ్లకు వెళ్లి చూడగా అసలు విషయం బయటకు వచ్చింది. ఉట్కూరు మండలంలోని తిప్రాస్‌పల్లిలోనూ ఇదే విధంగా జరిగింది. దీంతో బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ చేపట్టగా సుమారు 300మంది పేర్ల మీద ఈ విధంగా రుణాలు తీసుకున్నట్లు బయటకు వచ్చింది. రుణాల విలువ సుమారు రూ.రెండు కోట్లకుపైగానే ఉన్నట్లు సమాచారం. వడ్డీతో కలుపుకుంటే వీటి విలువ మరింత పెరగనుంది.
రంగంలోకి ఇంటలిజెన్సు అధికారులు
ఉట్కూరు ఎస్‌బీఐలో నకిలీ పాసుపుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో దళారులు రుణాలు పొందిన వైనంపై ఇంటలిజెన్సు విభాగం అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో కూపీ లాగడానికి ప్రయత్నాలు చేశారు. ఉట్కూరులోని ఎస్‌బీఐ శాఖ కార్యాలయానికి, గ్రామాలకు వెళ్లి విచారణ జరిపారు. బ్యాంకు మేనేజరు సెలవులో ఉండడంతో ఎలాంటి వివరాలు సేకరించలేకపోయారు. బాధితులను కలిసి కొన్ని వివరాలు సేకరించారు.
మూడు రోజుల నుంచి అంతర్గత విచారణ..
ఈ వ్యవహారంలో మూడు రోజుల నుంచి బ్యాంకు అధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. మహబూబ్‌నగర్‌లోని రీజినల్ బ్యాంకు అధికారులు ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణలో బ్యాంకును మోసం చేసి నకిలీ పాసు పుస్తకాలు, ఫోర్జరీ సంతకాలతో రుణాలు పొందినట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఎస్‌బీఐ రాష్ట్ర అధికారులకు లేఖ రాయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి కూడా అధికారులు వచ్చి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉంటాయని ఓ బ్యాంకు అధికారి వెల్లడించారు. ఈ వ్యవహారంపై వివరణ కోసం బ్యాంకు అధికారులను సంప్రదించగా బ్యాంకు అంతర్గత వ్యవహారం కావడంతో స్పందించడానికి నిరాకరించారు.
బ్యాంకర్లు గ్రామాలకు వెళ్లి రుణాలు చెల్లించాలని బాధితులను అడిగారు. చాలా మంది ఎవరూ రుణాలు తీసుకోలేదని చెబుతున్నారు. ఆ సర్వే నంబర్లలో తమకు భూములే లేవని అంటున్నారు. వారు సర్వే నంబర్లు , రుణాల పొందిన వ్యక్తుల ఫొటోలు సరితూగడం లేదని అన్నారు. అందులో నకిలీ పత్రాలు ఉన్నట్లు తేలింది . అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది బ్యాంకు అధికారులే.
-తహసీల్దార్
ఇదీ చదవండి: ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద తెరాస, భాజపా శ్రేణుల ఘర్షణ