హైదరాబాద్ ముసారాంబాగ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. రెండ్రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారిని క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఆటోడ్రైవర్ శ్రవణ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు.
మలక్‌పేట్ ముసారాంబాగ్‌కు చెందిన సుద్గు, అతని భార్య, రెండున్నర సంవత్సరాల కుమార్తెతో కలిసి నగరంలో నివాసముంటున్నారు. వీరు రాత్రి సమయాల్లో ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తారు. రోజు మాదిరిగానే ఈ నెల 28న ఫుట్‌పాత్‌పై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో లేచి చూసేసరికి తమ కుమార్తె లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ దొరకపోవడం వల్ల ఆందోళన చెందిన వారు.. వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ దృశ్యాలను పరిశీలించారు. చిన్నారిని ఓ ఆటో డ్రైవర్ అపహరించినట్లు గుర్తించారు. నిందితుడు కాచిగూడ గోల్నాకకు చెందిన శ్రవణ్కుమార్గా తేల్చారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు.
ఇది వరకే పలు కేసులు..
నిందితుడిపై ఇదివరకే వివిధ పోలీస్‌స్టేషన్‌లలో దొంగతనం కేసులు నమోదయ్యాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న శ్రవణ్.. పిల్లలను అపహరించి పిల్లలు లేని వారికి విక్రయించడానికి సిద్ధపడినట్లు వివరించారు.
విజయవంతంగా..
ఈ సందర్భంగా ఈ తరహా కేసులను ఛేదించేందుకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా గతేడాది 2,409 మందిని సురక్షితంగా కాపాడగా.. వీరిలో 376 మంది చిన్నారులున్నారన్నారు. 277 మంది చిన్నారులను తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చగా.. మిగతా 99 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: తల్లీ, కుమార్తె ఆత్మహత్య... కుటుంబ కలహాలే కారణమా?