Drugs King pin Balamurugan arrest : ఐదు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల దందా కొనసాగిస్తున్న డ్రగ్ కింగ్ పిన్ బాలమురుగన్‌ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, రాంగోపాల్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గోవా కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్న ఎడ్విన్‌కు బాలమురుగన్ ప్రధాన అనచురుడు. ఇద్దరూ కలిసి 15 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు మత్తుపదార్థాలు తరలిస్తూ కోట్లకు పడగెత్తారు. పోలీసులకు చిక్కకుండా దర్జాగా మత్తు వ్యాపారం సాగించిన ఎడ్విన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడి నుంచి రాబట్టిన సమాచారంతో గోవా, దిల్లీ, ముంబయి, తమిళనాడు తదితర ప్రాంతాల్లో బాలమురుగన్ కోసం గాలించారు. గోవాలో తలదాచుకున్నట్టు గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. తమిళనాడుకు చెందిన బాలమురుగన్ హోటళ్లు నిర్వహిస్తున్నాడు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా తదితర పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు ఏర్పాటు చేశాడు. బయటి ప్రపంచానికి తెలియకుండా మాదకద్రవ్యాలు విక్రయిస్తాడు.
విందు, వినోదాలతో పర్యాటకులను ఆకట్టుకుని డ్రగ్స్ చేరవేసేవాడు. గోవాలో డ్రగ్స్ కింగ్ ఎడ్విన్ కూడా హోటళ్లు నిర్వహిస్తుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి గంజాయి, హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చి ఎడ్విన్ అందజేసేవాడు. ప్రతిఫలంగా అతడి నుంచి కొకైన్, హెరాయిన్, ఎల్ఎస్ఓ బ్లాట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్ తీసుకునేవాడు. ఇద్దరి నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించారు. పరస్పరం సాయం చేసుకుంటూ డ్రగ్స్ సరఫరాలో కీలకంగా మారారు.
చిన్న హోటళ్లు, పబ్‌లు ఎవరైనా వీరి వద్దే మాదకద్రవ్యాలు కొనుగోలు చేయాలి. బాలమురుగన్ జాబితాలో సుమారు 2 వేల మంది వరకు కొనుగోలుదారులున్నట్టు సమాచారం. వీరిలో పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులున్నట్టు తెలుస్తోంది. 2015లో గంజాయి విక్రయిస్తుండగా రాజస్థాన్ పోలీసులు బాలమురుగన్‌ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మకాం హిమాచల్ ప్రదేశ్‌కు మార్చాడు.
అక్కడ ధర్మశాల పేరుతో హోటల్ ప్రారంభించి దందా మొదలు పెట్టాడు. అనంతరం గోవా చేరి గరంమసాలా హోటల్ ప్రారంభించాడు. ఎడ్విన్ అండదండలతో డ్రగ్స్ కింగ్ పిన్‌గా ఎదిగాడు. గోవా నుంచే ఐదు రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు చేరవేస్తూ చక్రం తిప్పాడు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. చివరకు హెచ్-ఎన్ఈడబ్య్లూ పోలీసులకు చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.
బాలమురుగన్ నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. సోమవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. కొన్ని రోజులుగా గోవాలో మకాం వేసిన హైదరాబాద్ పోలీసులు.. కీలక సూత్రదారుల గుట్టురట్టు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు పోలీసు బృందాలు దిల్లీ, ముంబయిలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇవీ చదవండి: