Mahesh Bank Server Hacking Case: మహేష్ బ్యాంక్ హ్యాకింగ్‌కు గురవటానికి కారణం.. సర్వర్ లోపమేనని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హ్యాకింగ్‌కు గురైన 12.9 కోట్ల రూపాయలు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని.. అందులో 3కోట్ల వరకు నిలుపుదల చేసినట్లు సీపీ తెలిపారు. మహేష్ బ్యాంక్‌కు సంబంధించిన మూడు ఖాతాలు దేశంలోనే వివిధ 120 బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు సీపీ వెల్లడించారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినప్పుడు సరైన భద్రత ఇవ్వడం వారి కనీస బాధ్యతని తెలిపిన సీపీ... నిర్లక్ష్యంగా వహించినందుకు బ్యాంకుపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
"మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పురోగతి ఉంది. ఇప్పటికే 12.9 కోట్లు వేరే అకౌంట్లకు బదిలీ అయ్యాయి. అందులో మూడు కోట్ల వరకు నిలిపేశాం. ఆ అకౌంట్లు ఎవరు తీశారు.. అన్న సమాచారం కొంచెం తెలిసింది. ఈ హ్యాకింగ్ అనేది ఎక్కడి నుంచి జరిగిందనేది లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో బ్యాంకు యాజమాన్యాల నిర్లక్ష్యం తెలుస్తోంది. ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంచినప్పుడు.. అందుకు తగిన సైబర్ సెక్యూరిటీ పాలసీని అవలంబించాలి." - సీవీ ఆనంద్, సీపీ
డ్రగ్స్‌కేసులో దర్యాప్తు ముమ్మరం..
International drug case: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కేసులోనూ వేగంగా దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ వెల్లడించారు. ప్రధాన నిందితుడైన టోనీ వద్ద స్వాధీనం చేసుకున్న చరవాణిలో కాల్‌డేటాను పరిశీలిస్తున్నామని సీపీ తెలిపారు. వాట్సాప్ సందేశాలు డిలీట్ చేసినందున నెట్‌వర్క్ నుంచి నిందితుని సంభాషణల వివరాలు సేకరిస్తున్నామన్నారు. టోనీ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలు కూడా కనుక్కుంటున్నామని వివరించారు. త్వరలోనే మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.
షీ టీమ్స్‌లో మరికొన్ని సంస్కరణలు..
SHE Teams: రానున్న రోజుల్లో షీ టీమ్స్‌లో మరికొన్ని సంస్కరణలు తీసుకువస్తామని సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హైదరాబాద్ హకా భవన్‌లోని షీ టీమ్స్, భరోసా కేంద్రాన్ని సీపీ సందర్శించారు. ఆ కేంద్రాల్లో మహిళలు పౌరులకు అందుతున్న పోలీసు సేవలపై షీ టీమ్స్ డీసీపీ శిరీషతో చర్చించారు. గడిచిన ఐదేళ్లుగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలు మహిళలకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయన్నారు. ఆ విభాగాల పనితీరును సీపీ ప్రశంసించారు.
ఇదీ చూడండి: