మరికాసేపట్లో కన్న కూతురి వివాహం.. ఎంతో సంతోషంగా కన్యాదానం చేయాల్సిన సమయం.. పెళ్లి జరగడానికి ముందే అనూహ్యంగా వధువు తల్లిదండ్రులు ఈ లోకం వీడారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో పెళ్లింట జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెళ్లి జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు ఎవరికీ చెప్పకుండా ఫంక్షన్‌హాల్ నుంచి వారి ఇంటికి వెళ్లిపోయారు. కన్యాదానం సమయంలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కోసం బంధువులు వెతకగా.. వారు కనిపించలేదు. దంపతులు కనిపించకపోవడంతో ఇంటికెళ్లి చూడగా గదిలో విగతజీవులై కనిపించారు.
సమాచారం అందుకున్న ఎంవీపీ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విశాఖ పోర్టు విశ్రాంత ఉద్యోగి జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
భార్య ప్రవర్తనతో విసుగు చెంది..
పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంలగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఈ కారణంగా విజయలక్ష్మి తరచూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడేదని.. పెళ్లి రోజు కూడా భర్తతో గొడవ పడిందని బంధువులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భార్య ప్రవర్తనతో విసుగు చెందిన జగన్నాథరావు.. ఆమెను చంపి, తాను కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆశలు ఆవిరయ్యాయని... ఐదేళ్ల కుమార్తెతో సహా తల్లి బలవన్మరణం!