వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. గర్భవతి కాకున్నా...గర్భవతి అని చెప్పి వైద్యం చేశారు. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళకు అక్కడి ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి గర్భవతి అని తేల్చారు. దీంతో ఆమె ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన విజయవాడకు వెళ్లారు. అనంతరం వైద్యం కోసం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా.. అక్కడ ఎలాంటి పరీక్షలు చేయకుండా కొన్ని నెలలుగా మాత్రలు ఇచ్చి పంపించారు. గర్భవతి అని చెప్పి పది నెలలైనా.. నొప్పులు రాకపోవటంతోవ ఆందోళనకు గురైన ఆ మహిళ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించింది.
పరీక్షల్లో మహిళ గర్భవతి కాదని.. ఆమె కడుపులో కణితి ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. పాత ప్రభుత్వాసుపత్రి సిబ్బంది తీరుపై కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి పది నెలలు ఆసుపత్రి చుట్టూ తిప్పుకున్నారని మండిపడ్డారు. ఆయా వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: SUICIDE: ఉదయం మూడు ముళ్లేసి.. రాత్రికి ఉరేసుకున్నాడు