భాగ్యనగరంలో వాట్సప్ వేదికగా ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం గుట్టుగా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పంచతార హోటల్‌పై ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన అంశాలు పోలీసులనే విస్తుగొలిపాయి. కజకిస్థాన్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి యువతులను భారత్‌కు విజిట్ వీసాపై రప్పించి, గడువు ముగిసే వరకు కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ నగరాలకు తిప్పుతున్నారు. తర్వాత కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా వీటితోనే తిష్ఠవేస్తున్నారు. మణికేష్ చరవాణిలో వ్యభిచారానికి సంబంధించిన లావాదేవీలు వెలుగుచూశాయి. నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లు, వాట్సాప్ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ భారీ వ్యవస్థను ఛేదించేందుకు త్వరలోనే నిందితుణ్ని కస్టడీలోకి తీసుకోనున్నారు.
ఒక్కోచోట ఒకట్రెండు రోజులే
ఆయా నగరాల్లోని పంచతార హోటళ్లలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటారు. అమ్మాయిలను ఎప్పుడు తీసుకొచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది. విటుల్లో సంపన్నులు, వారి పిల్లలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే అధికులు. విదేశీ యువతులకున్న డిమాండ్ దృష్ట్యా భారీగా వసూలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'నాన్నా.. నన్ను చంపినా పాడుపనికి వెళ్లను'