Heart Touching Incident: అయినవాళ్లు అందరూ ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ అంగన్‌వాడీ టీచర్ చనిపోయి రెండ్రోజులైనా ఎవరూ గుర్తించని దయనీయ ఉదంతమిది. మృతదేహం చుట్టూ చీమలు పట్టిన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పాశంవారిగూడెం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. ఈ గ్రామానికి చెందిన పాశం రాజేశ్వరి(60).. భర్త మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉండగా రెండేళ్ల క్రితం కొడుకు చనిపోయాడు. దీంతో పిల్లలతో కలిసి కోడలు హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆడపిల్లలు అత్తారిళ్లలో ఉంటున్నారు.
రాజేశ్వరి ఒక్కరే గ్రామంలో ఉంటూ అంగన్‌వాడీ టీచరుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం స్థానికులతో మాట్లాడిన ఆమె.. ఆ తర్వాత కనిపించలేదు. క్రిస్మస్ సెలవులు రావడం, ఆమె ఇల్లు కాలనీలో చివరన ఉండడంతో ఎవరూ అటువైపు తొంగిచూడలేదు. 50 గడపలు మాత్రమే ఉండే ఆ ఊళ్లో చాలామంది పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామం దాదాపుగా నిర్మానుష్యంగానే ఉండడంతో ఆమె గురించి ఆరా తీసేవారే లేకపోయారు. ఏ క్షణాన ఉప్పెనలా గుండెపోటు వచ్చిందో కానీ వీధి అరుగు మీద కూర్చున్న ఆమె ఇంటి గుమ్మం మీదనే కుప్పకూలి చనిపోయింది. ఆదివారం ఉదయం అటు వెళ్లిన ఓ అబ్బాయి రాజేశ్వరి ఇంటి గడప మీద పడిపోయి ఉండడాన్ని గమనించి స్థానికులకు చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి నిర్జీవంగా పడి ఉన్న ఆమె చుట్టూ చీమలు పట్టి ఉన్నాయి. రెండు రోజుల క్రితమే గుండెపోటుతో చనిపోయి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆమె చనిపోయిన తీరును చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఆమె గ్రామానికి చేసిన సేవలు గుర్తుచేసుకుని ఇలా దిక్కులేకుండా మృతిచెందడం బాధాకరమని వాపోయారు.
అమ్మనాన్నలు ఉన్నంత వరకు వారి విలువ తెలియదు. చనిపోయాక వారి విలువ తెలిసినా పెద్ద ప్రయోజనం ఉండదు. దూరంగా ఉన్నా.. వారి గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మనకు ఉండాలి అంటున్నారు స్థానికులు.
ఇదీ చూడండి: పెళ్లికి వెళ్లి విగతజీవులుగా.. రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి