నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు(22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ వృత్తివిద్య చదువుతున్నాడు. కొన్ని రోజుల కిందట అతని ఫోన్‌కు ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. ‘నేను ఒంటరి మహిళను, మీతో ఛాట్ చేయాలనుకుంటున్నాను’ అనేది దాని సారాంశం. స్పందించిన అతను దాన్ని పంపిన వారి ఫోన్ నంబరును సంప్రదించగా, అవతలి వైపు నుంచి యువతి కవ్విస్తూ మాట్లాడింది. ఆపై వీడియో కాల్‌చేసి నగ్నంగా కనిపిస్తూ ఛాటింగ్ చేసింది. ‘నాకు నగ్నంగా చూడమే ఇష్టమంటూ’ యువకుడినీ ప్రేరేపించింది. ఆ దృశ్యాలను రికార్డు చేసింది.
డబ్బుల కోసం వేధింపులు
తర్వాత క్షణం నుంచే డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేయడంతో అవాక్కవడం యువకుడి వంతయింది. యువకుడు స్పందించకపోవడంతో వీడియోలు యూట్యూబ్‌లో పెడతానంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. తన ఖాతాలో ఉన్న రూ.24 వేలు వారిచ్చిన ఖాతాకు బదిలీ చేసినా బెదిరింపులు ఆగలేదు.
ఇంకా కావాలంటూ తరచూ ఫోన్ చేసి వేధిస్తుండటంతో భయపడిన అతను నాలుగు రోజుల కిందట స్వగ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు వేకువజామున పొలం వద్ద పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు తొలుత జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి, తర్వాత సికింద్రాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి యువకుడు మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: మహిళను ఢీకొట్టిన బైక్ రైడర్.. చికిత్స పొందుతూ మృతి