ఓ చోరీ కేసును సిరిసిల్ల పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. సిరిసిల్ల పట్టణంలోని బి.వై.నగర్‌కు చెందిన శ్రీపతి మల్లమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు తెంపుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిరిసిల్ల టౌన్ సి.ఐ.అనిల్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం దొంగతనానికి పాల్పడిన వ్యక్తి శివగా గుర్తించి పట్టుకున్నారు. అతను దొంగలించిన బంగారు పుస్తెల తాడును.. ఓ నగల వ్యాపారికి అమ్మినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో ఆ వ్యాపారి నుంచి పుస్తెల తాడును స్వాధీనం చేసుకున్నారు.
నేరస్తుడు శివ ఆన్లైన్లో డబ్బులు పెట్టి గేమ్‌లు ఆడుతూ, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే డబ్బుల కోసం చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దొంగతనానికి పాల్పడిన మ్యాన శివను, బంగారు చైన్ కొనుగోలు చేసిన వ్యాపారి శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ కోరారు. కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలను నివారించే అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సి.ఐ.అనిల్ కుమార్, ఎస్.ఐ సుధాకర్, పుల్కం శ్రీనివాస్, నీలం జగదీశ్వర్ రామ్మోహన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Suicide: ఆర్థిక సమస్యలతో ఆ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి..