Gas Cylinder Blast in Nirmal : నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ వీధిలో గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఇల్లు ధ్వంసమైంది. ఇంటి పైకప్పు రేకులను చీల్చుకొని.. సిలిండర్ ఇంటి వాకిట్లో పడింది. ఇంట్లోని వస్తువలన్నీ దగ్ధమయ్యాయి. యాభై వేల రూపాయలు, కాలిపట్టీలతో పాటు బట్టలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే సామాగ్రి కాలి బూడిదైంది.
వచ్చేలోపే ఇల్లు దగ్ధం
సమ్మక్క-సారక్క జాతర కోసం కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరానని... నిర్మల్ నుంచి కొండాపూర్ వరకు వెళ్లగానే ఇల్లు కాలిపోతున్నట్టు ఫోన్ వచ్చిందని బాధితురాలు లక్ష్మి వాపోయారు. తాము వచ్చేలోపే అన్ని కాలిబూడిదయ్యాయని బోరున విలపించారు. చీటీ డబ్బులు రూ.50 వేలు వస్తే... ఇంట్లో పెట్టానని... సామాగ్రితో పాటు నగదు కూడా కాలిపోయిందని తెలిపారు. ఉన్న గూడు కాస్తా పోయిందని... రోడ్డున పడ్డానని బోరుమన్నారు. దాదాపు లక్ష రూపాయల దాకా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమ్మక్క-సారక్క జాతర కోసం బయల్దేరాం. కొంతదూరం పోయాం. అప్పటికే ఇల్లు కాలిపోతోందని ఫోన్ వచ్చింది. ఇంట్లో యాభైవేల రూపాయలు కూడా ఉన్నాయి. జాతర పోయివచ్చినాక బాకీ కడుదామని అనుకున్నా. ఉన్న ఇల్లు, బట్టలు, నగదు, కాలి పట్టీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. నేను రోడ్డున పడ్డాను.
-లక్ష్మి, బాధితురాలు
ఇల్లు కాలుతోందని మాకు సమాచారం అందింది. వెంటనే మా సిబ్బంది వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. వచ్చి చూస్తే గ్యాస్ సిలిండర్ పేలి ఉంది. మంటలు ఆర్పేశాం. నష్టం గురించి ఇంకా తెలియరాలేదు.
-అగ్నిమాపక శాఖాధికారి
ఇదీ చదవండి: జనమయమైన జంపన్న వాగు.. పుణ్యస్నానాలతో పునీతులవుతున్న భక్తులు..