. బస్తీల్లో గుడుంబా, రోడ్లపైనే మద్యం ఏరులై పారుతోంది. చుక్క పడితే, మత్తెక్కితే విచక్షణ మరిచి రెచ్చిపోతున్నారు కీచకులు. ఫిర్యాదులొచ్చినా పోలీసులూ, ఆబ్కారీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో.. ఎందరో పసికందులు, యువతులు ఈ మృగాల చేతికి చిక్కి బలవుతున్నారు. ఈ అకృత్యాలకు కారణమవుతున్న అసాంఘిక అడ్డాలపై ప్రత్యేక కథనం.
అది ‘మత్తు’ గని!
ఆరేళ్ల పసికందు బతుకు ఛిద్రమయ్యేందుకు సాక్ష్యంగా నిలిచిన సైదాబాద్ ఠాణా పరిధిలోని సింగరేణి కాలనీ పేద కూలీల బస్తీ. చెత్త ఏరుకోవడం, అసంఘటిత రంగాల్లో పని ఇక్కడి నివాసితులకు ఉపాధి. ఇక్కడ ఏ సమయమైనా మద్యం, గంజాయి, గుడుంబా దొరుకుతుందని, చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు రోడ్లే అడ్డాలవుతాయన్నది జగమెరిగిన వాస్తవం. అంతకుముందు ఏమాత్రం పట్టించుకోని పోలీసులు చిన్నారి హత్యాచారం తర్వాత పెద్దఎత్తున విమర్శలు రావడంతో చర్యలు మొదలుపెట్టడం గమనార్హం. పక్కనే ఖాజాబాద్, చింతల్‌బస్తీల్లోనూ ఇదే తంతు.
‘‘నేను పనిచేసే ప్రాంతానికి అతి దగ్గరలో ఉంటుంది సింగరేణి కాలనీ. ఓ రోజు రాత్రి 12గంటలకు అటు నుంచి వెళ్తుంటే ముగ్గురు మహిళలు రోడ్డుపై ఆపారు. డబ్బులిమ్మని బెదిరించారు. ఆ సమయంలో అటుగా ఓ పోలీసు వచ్చి కాపాడారు. ఇకపై ఈ మార్గంలో వెళ్లొద్దు.. అంత భద్రం కాదని హెచ్చరించారు. ఇక్కడ గంజాయి, వైట్నర్లు సులువుగా లభిస్తాయి.’’ అని ఓ యువకుడు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.
పరిధి కాదని పట్టించుకోవట్లే!
మల్లాపూర్ పారిశ్రామికవాడ పరిధిలో సూర్యనగర్, గోకుల్‌నగర్ కాలనీలను ఆనుకొని ఉన్న రైలు పట్టాలు మత్తు సేవనానికి అడ్డా. ఇటీవలె అటుగా రైలుపట్టాలు దాటుతున్న దంపతులపై తాగుబోతులు దాడికి తెగబడ్డారు. వీటిపై ఫిర్యాదు చేసేందుకు నాచారం ఠాణాకు వెళ్తే.. పట్టాల అవతల జరిగితే కుషాయిగూడ పరిధిలోకి వస్తుందని వెనక్కి పంపారు. నగరంలో చాలా ఠాణాల్లో ఇలాగే జరుగుతోంది.
ఆగడాలు జరిగేదిక్కడే..
- కుల్సుంపుర ఠాణా పరిధిలో పురానాపూల్ చౌరస్తా సమీపంలో రెండు మద్యం దుకాణాలు, రెండు బార్లు, ఓ కల్లు కాంపౌండ్ ఉన్నాయి. జియాగూడ, గోల్కొండ, లంగర్‌హౌజ్ వెళ్లే దారి ఇదే. ఎప్పుడు చూసినా మందుబాబుల జాతరే. ఇటుగా వచ్చే పేద మహిళలను అపహరించి అత్యాచారాలు చేసి హత్యలు చేసిన దాఖలాలు అనేకం. ఇక్కడి ఠాణా పరిధిలో 6 నెలల్లో 150 నేర ఘటనలు నమోదయ్యాయి.
- నాంపల్లి రైల్వే స్టేషన్ గంజాయికి అడ్డా. చరిత్రాత్మక సరాయి భవనం చూసేందుకు వచ్చినవారిపైనా ఆగడాలకు పాల్పడుతున్నారు. వైట్నర్ తీసుకున్న మత్తులో చేతులు కోసుకొని మృగాల్లా ప్రవర్తించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది.
- కుత్బుల్లాపూర్ ఆబ్కారీ ఠాణా పరిధిలో 10, చందానగర్ ఠాణా పరిధిలో 100 కేసులు గంజాయి, మత్తుకు సంబంధించి నమోదయ్యాయి. అల్విన్‌కాలనీ పరిధిలో పలు ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ నమోదైన 10 కేసుల్లో ఎక్కువ మంది ఇంజినీరింగ్ విద్యార్థులే బానిసలని తేలింది.
- మలక్‌పేట ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలు చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా. రాత్రయితే ఇటుపక్క పురుషులూ వెళ్లాలన్నా భయపడాల్సిన దుస్థితి. ఈ ఠాణా పరిధిలో 70కేసులు నమోదయ్యాయి.
- మల్లాపూర్ నెహ్రూనగర్ బస్తీలో 500 కుటుంబాలుంటే 50 గొలుసుకట్టు దుకాణాలుండటం గమనార్హం. చర్లపల్లిలో ప్రధాన రహదారే మందుబాబులకు అడ్డాగా మారి మహిళలను భయపెడుతోంది.
- ఎల్బీనగర్ పరిధిలో నందనవనంలో 10వేల జనాభా ఉంది. దాదాపు అంతా దినసరి కూలీలే. ఇక్కడ దాదాపు 10కిపైగా బెల్టు షాపులున్నాయి. ఇక్కడ ఓ ప్రైవేటీ కాలేజీ స్థలంలో అమ్మే గంజాయి కోసం ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు తరలొస్తారు. మత్తులో అకృత్యాలకు పాల్పడుతున్నారు విద్యార్థులు. వీటిపై 20 ఘటనలు పోలీసుల దృష్టికొచ్చాయి.
- కూకట్‌పల్లి మెట్రో సమీపంలో రాత్రయితే కొందరు హిజ్రాలు అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ.. అటుగా వచ్చిపోయే వారిని వేధిస్తున్నారు.
ఇదీ చూడండి: heroin case updates : హెరాయిన్ కేసులో సుధాకర్ పాత్రధారి.. దిల్లీ వ్యక్తే కీలక సూత్రధారి