Police interrogating Seshanna: గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న పోలీసులు అదుపులో ఉన్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని ఓ రెస్టారెంట్ లో సెటిల్ మెంట్ చేస్తుండగా జరిపిన దాడిలో శేషన్నను అదుపులోకి తీసుకుని, ఓ తుపాకీని గుర్తించినట్లు తెలుస్తోంది. శేషన్న అరెస్టుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అచ్చంపేటకు చెందిన శేషన్న కొంతకాలం పీపుల్స్ వార్ లో పనిచేసి ఆ తర్వాత లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు.
2016 నుంచి అజ్ఞాతంలో ఉన్న శేషన్న: అప్పటి నుంచి నయీం ప్రధాన అనుచరుడిగా కొనసాగుతూ బెదిరింపులు, హత్యలు, హత్యాయత్నాలకు చెందిన అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. 2016లో షాదనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మృతి చెందడంతో అప్పటి నుంచి శేషన్నఅజ్ఞాతంలోకి వెళ్లాడు. గత కొన్ని నెలల క్రితం అబ్దుల్లా అనే వ్యక్తి పిస్టల్‌తో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అబ్దుల్లాను అరెస్టు చేసిన హుమాయూన్‌నగర్ పోలీసులు నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంతో శేషన్నకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు.
హుమాయూన్‌నగర్ పీఎస్‌లో శేషన్నపై కేసు నమోదు: అబ్దుల్లాకు శేషన్నే పిస్టల్ ఇచ్చినట్లు నిర్ధారించారు. ఇందులో భాగంగానే మూడు నెలల క్రితం హుమాయూన్‌నగర్ పీఎస్‌లో శేషన్నపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే కళ్లుగప్పి తిరుగుతున్న శేషన్నను కొత్తపేటలోని ఓ రెస్టారెంట్‌లో కౌంటర్ ఇంటలిజెన్స్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి వరకు శేషన్న అరెస్టును ప్రకటించని పోలీసులు ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.
హుమాయన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శేషన్నను కౌంటర్ ఇంటలీజెన్స్, ఎస్ఐబీ, శాంతిభద్రతా విభాగం పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మైలార్‌దేవ్‌పల్లి, హుమాయూన్ నగర్, గోల్కొండ పీఎస్‌లతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ శేషన్నపై కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న శేషన్నకు ఆశ్రయం కల్పించిందెవరు? ఆయనకు ఆయుధాలు ఎక్కడి నుంచి అందుతున్నాయనే అంశాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: