డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని ఓ మహిళ నుంచి డబ్బులు తీసుకుని, ఆమె నిలదీయటంతో.. ఫొటోలు, వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరించాడు ఓ కార్పొరేటర్ అనుచరుడు. అతడిని బాధిత మహిళ.. కార్పొరేటర్ కార్యాలయంలోనే చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
గౌతమీ నగర్లో నివాసముండే సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ అనుచరుడిగా ఉంటున్నాడు. ఫిరోజ్ గూడకు చెందిన ఓ వివాహితతో అహ్మద్‌కు ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని చెప్పి.. ఆమె నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇవ్వకపోవడమే గాక, డబ్బులు తిరిగి ఇవ్వకపోవటంతో ఆ మహిళ అహ్మద్‌ను నిలదీసింది. ఈ శనివారం.. కార్పొరేటర్ కార్యాలయం వద్దకు వచ్చిన బాధితురాలు మరోసారి అహ్మద్‌ను నిలదీయటంతో.. తనతో ఉన్న ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె అతడిని చెప్పుతో కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన