షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పరుపుల ఫ్యాక్టరీ దగ్ధమైన ఘటన... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. రామచంద్రరావు బంజర్లోని ఓ పరుపులు ఫ్యాక్టరీలో రోజు వారి విధులను ముగించుకుని... సిబ్బంది, యజమాని ఫ్యాక్టరీకి తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. సుమారు రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పరుపులు తయారు చేసే మిషన్లు, కంప్యూటర్లు, ముడి సరుకు, తయారు చేసి తరలించేందుకు సిద్ధంగా ఉన్న పరుపులు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి.
ఓ వాహనం కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో సుమారు రూ. 1.2 కోట్ల మేర నష్టం జరిగినట్లు... ఫ్యాక్టరీ యజమాని రామకృష్ణ తెలిపారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంకొంత ఆలస్యం అయి ఉంటే... ఇదే ఆవరణలో ఉన్న మిర్చి గోదాం కూడా మంటలు అంటుకొని ఆస్తి నష్టం మరింత పెరిగేది.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్ కేసులో మరోకరు అరెస్టు