Father Killed Son: వివాహ వేడుకలో తప్పతాగిన దంపతుల మధ్య జరిగిన ఘర్షణ.. వారి 11 నెలల చిన్నారిని బలితీసుకుంది. గుండెలపై ఎత్తుకుని లాలించాల్సిన కన్న తండ్రి.. ఆ ప్రేమను మరిచి భార్యపై కోపంతో కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి ఉసురుతీసుకున్నాడు. తాగిన మైకంలో లేలేత పసికందును ఇటుక బట్టీకేసి బాది చంపేశాడు. ఈ హృదయవిదారక ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పులిమడుగులో చోటుచేసుకుంది. నిందితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన నరేష్ దంపతులు.. స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి 11 నెలల బాబు శ్రీ కృష్ణ ఉన్నాడు. ఆదివారం రోజు వివాహ విందుకు హాజరైన దంపతులిద్దరూ పీకల దాకా మద్యం సేవించారు. అక్కడ డీజేలో ఆడిపాడారు. అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నరేష్ తన భార్యను భోజనం వడ్డించమని అడగడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తెల్లారిన తర్వాత ఆమె యథావిధిగా ఇటుక బట్టీకి వెళ్లింది. రాత్రి భార్య అన్నం పెట్టలేదని కోపంతో ఉన్న నరేష్.. ఆగ్రహంతో ఇటుక బట్టీకి వెళ్లాడు. అక్కడ వారితో పాటు పిల్లాడు కూడా ఉన్నాడు.
ఇటుక బట్టీ వద్ద దంపతులిద్దరూ గొడవపడుతుండగా.. వారిని చూసి శ్రీ కృష్ణ ఏడవడం మొదలుపెట్టాడు. పసికందు ఏడుపుతో మరింత ఊగిపోయిన నరేష్.. ఆవేశంలో బాబు తలను పట్టుకుని ఇటుక బట్టీకేసి మూడుసార్లు కొట్టాడు. ఆ కసాయి తండ్రి దెబ్బలు తాళలేక.. పసికందు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. చుట్టూ అందరూ ఉన్నా.. వారు స్పందించేలోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. విచక్షణ కోల్పోయిన తల్లిదండ్రుల కారణంగా అభంశుభం తెలియని పసికందు ఏడాది తిరక్కముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడున్న వారందిరినీ కలిచివేసింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: దారుణం.. బ్లేడుతో భర్త గొంతు కోసిన భార్య