Jagtial Road Accident: తెల్లారితే పెళ్లి భాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆడపిల్ల పెళ్లితో బంధుమిత్రులతో సందడి నెలకొన్న ఆ కుటుంబంలో ఇంటిపెద్ద మరణ వార్తతో తీరని శోకం మిగిలింది. ఇప్పుడే వస్తానని బయటకు వెళ్లిన తన భర్త.. ఇక సజీవంగా రాడని తెలిసి అతని భార్య గుండెలవిసేలా రోదిస్తోంది. పెళ్లి సామగ్రి కోసం బయటకు వెళ్లిన తన తండ్రి.. రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారేసరికి నూతన వధువు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది.
అప్పటివరకూ తమతో సరదాగా గడిపిన ఇంటి పెద్ద మరణాన్ని తట్టుకోలేకపోయిన బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొద్ది గంటల్లో కూతురిని ఓ అయ్య చేతిలో పెడితే ఇక తన బాధ్యత తీరుతుందనుకున్న ఆ తండ్రి.. ఇక ఏ బాధ్యతను మోసే అవసరం లేకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక నాన్న అనే పదానికి దూరమైన ఆయన ఇద్దరు కుమార్తెలు ఏకధాటిగా రోదించడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్లో గురువారం(ఏప్రిల్ 21).. బైన నర్సయ్య కూతురు వివాహం జరగాల్సి ఉంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురి పెళ్లి బాధ్యతలు తీరగా.. ఇక చిన్న కుమార్తె రేపు జరగనుంది. పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన నర్సయ్య.. ఇంకా తీసుకురావాల్సిన సామగ్రి కోసం ద్విచక్రవాహనంపై తన అన్న కుమారుడు అజయ్‌తో కలిసి జగిత్యాల వెళ్తున్నారు. ఈ క్రమంలో జాబితాపూర్ సమీపానికి చేరుకోగానే.. తాము వెళ్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఘటనలో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మృతి సమాచారం అందుకున్న కుటుంబీకులు, గ్రామస్థులు.. హఠాత్పరిణామంతో దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి సందడి కొనసాగుతున్న ఆ ఇంట్లో తండ్రి మృతితో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: మత్తుమందు ఇచ్చి యువతిపై అత్యాచారం కేసులో నిందితులు అరెస్ట్
అల్లర్లు జరిగిన ప్రాంతాలకు 'బుల్డోజర్లు'.. అధికార, విపక్షాల మాటల యుద్ధం