నీరు తాగుతుండగా కూతురికి పొలమారితేనే తండ్రి అల్లాడిపోతాడు. అలాంటిది ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన కూతురు... నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ.. మునిగి తేలుతూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవతూ సాయం కోసం అర్థిస్తుంటే గట్టుమీదున్న తండ్రి గుండె ఎలా తట్టుకోగలదు. నీటిలో దిగితే తాను తిరిగొస్తాడో లేదో అని తెలిసిన కన్నపేగును కాపాడుకోడానికి ఆఖరి శ్వాసవరకు ప్రయత్నించాడు. బిడ్డను కాపాడుకోడానికి మృత్యువుతో తండ్రి చేసిన పోరాటంలో చివరికి మృత్యువే గెలిచింది. తండ్రీ కూతురిని నీట ముంచింది. ఈ హృదయ విదారకర ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ వద్ద జరిగింది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాస్ తండ్రి నెలరోజుల క్రితం మృతి చెందాడు. పుణ్యస్నానంకోసమని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాస్ లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తు పెద్ద కుమార్తె రిషిత కాలువలో పడిపోయింది. బిడ్డను కాపాడుకోడానికి తండ్రి కూడా కాల్వలోకి దూకేశాడు. లోతు ఎక్కువగా ఉండడం వల్ల తండ్రి కూతురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్థుల సహకారంతో తండ్రి కూతురి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కళ్లెదుటే కూతుర్ని భర్తను కోల్పోయిన ఆ మహిళ... గట్టుపై కూర్చుని దీనంగా ఎదురు చూస్తోంది. నీట మునిగిన వాళ్లు తిరిగొస్తారని ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కిన నయనాలతో నీటి వైపై చూస్తోంది. నీట మునిగిన బిడ్డ, భర్త ఎప్పటికీ రారనే సత్యాన్ని ఆమె హృదయం జీర్ణించుకోలేకపోతోంది. పైకి తీసిన మృతదేహాలపై పడి ఆమె రోదిస్తున్న తీరు మృత్యువుతో కూడా కంటతడి పెట్టించింది.