వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించారు. కమలాపూర్ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు శ్రీనివాస్‌రెడ్డి అనే రైతు బుధవారం నాడు ఎస్సై ముందే పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. భూ వివాదంలో శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారని బాధితుడి బంధువు తెలిపారు. భూమి శ్రీనివాస్‌రెడ్డి పేరు మీదనే ఉన్నప్పటికీ కేసు నమోదు చేశారని ఆరోపించారు.
పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో రైతు పురుగుల మందు తాగినట్లు బాధితుడి బంధువులు వివరించారు. శ్రీనివాస్‌రెడ్డిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇదీ చదవండి: స్నేహితులే హత్య చేశారు.. మూడు రోజుల్లో హత్యకేసు ఛేదన!