Farmer Suicide In Kamareddy: కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్‌ప్లాన్‌పై రగడ కొనసాగుతోంది. కొద్దిరోజులుగా దశల వారీగా వివిధరూపాల్లో బాధిత రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే రైతు ఆత్మహత్య ఉద్రిక్తతకు దారి తీసింది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన పయ్యావుల రాములు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్‌ప్లాన్‌లో భూమి పోతుందన్న భయంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు ఆరోపించారు.
మృతదేహాన్ని మధ్యాహ్నం సమయంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి ధర్నాచేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కామారెడ్డి బస్టాండ్ సమీపంలో మృతదేహాన్ని తీసుకొస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులంతా అక్కడే ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
అనంతరం రైతులకు నచ్చజెప్పిన పోలీసులు.. మృతదేహాన్ని తీసుకొస్తాం.. మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లాలని సూచించారు. రైతులంతా మున్సిపాలిటీ వద్దకు వెళ్లిన తర్వాత పోలీసులు మృతదేహాన్ని అదే ట్రాక్టర్‌లో బందోబస్తు మధ్య ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు మున్సిపాలిటీ వద్ద బైఠాయించారు. మృతుడి భార్య, పిల్లలు, గ్రామస్థులు, మాస్టర్‌ప్లాన్ బాధితులు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు తీరుకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మున్సిపల్ కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మృతుడి భార్యా పిల్లలు, బంధువులతో కలిసి నిరసన తెలిపారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేయాలంటూ బాధిత రైతులంతా గురువారం కామారెడ్డిలో కుటుంబ సభ్యులతో కలిసి భారీర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ఆందోళనకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాజరై మద్దతు తెలపనున్నారు.
ఇవీ చదవండి: