ఈ ఆధునిక ప్రపంచంలో మూఢ నమ్మకాలపై ఇంకా విశ్వాసం పోలేదు. రాజులు దాచిన నిధులు దొరుకుతాయని, క్షుద్ర పూజలు చేయడం, గుప్తనిధులు కోసం పురాతన ఆలయాలు ధ్వంసం చేయడం వంటివి నేటికీ జరుగుతూనే ఉన్నాయి.. ఇటువంటివి పాటించే వారు వీటిపై బలమైన నమ్మకంతో ఉంటున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
గుప్తనిధుల తవ్వకాలు జరుపుతున్నారంటూ ముగ్గురు వ్యక్తులను తండా వాసులు చితకబాదిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లాలోని సుల్తాన్పూర్ తండా వాసులు నిన్న రాత్రి గుప్తనిధుల తవ్వుతున్నారంటూ భూ యజమాని తులసీరాం నాయక్‌ను చితకబాదారు. అతనితో పాటు అక్కడే పూజ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సైతం చితక్కొట్టారు. అడ్డువచ్చిన భూయజమాని కుటుంబాన్నీ తండా వాసులు కొట్టారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులను, దాడిలో గాయపడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తండా వాసుల దాడిలో గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం నగర ఆసుపత్రికి తరలించారు. పూజా స్థలంలో సామగ్రిని, ధ్వంసమైన రెండు బైకులు, కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: