Drunkard hulchal: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో తాగుబోతు హల్చల్ చేశాడు. మైకంలో ఉన్న యువకుడు ఆస్పత్రిలో కాసేపు.. హంగామా సృష్టించాడు. పోలీసుల అసహనానికి కారణమయ్యాడు. పూటుగా తాగిన ఓ యువకుడు.. జియాగూడలో రోడ్లపై వచ్చీపోయే వాహనాలను అడ్డగిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో.. వెంటనే వచ్చిన కుల్సుంపురా పోలీసులు.. ఆ మందుబాబును అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. ఆ తాగుబోతు మాత్రం.. సామాన్యులకు పోలీసులకు తేడా ఏం చూపకుండా.. తనదైన ప్రవర్తనను కొనసాగించాడు. దీనంతటికీ కారణం లోపలున్న మందు మహిమగా గుర్తించిన పోలీసులు.. ముందు ఆ మత్తు వదిలించాలని తలచారు.
అతికష్టం మీద ఆ తాగుబోతును అదుపులోకి తీసుకుని.. నేరుగా ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లి.. మత్తు వదిలించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఆ తాగుబోతు ఉన్న దగ్గర ఉండక.. పోలీసులను ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడాడు. ఎంత నివారించిందుకు ప్రయత్నిస్తే.. అంతకు ఎక్కువ హంగామా చేయటం ప్రారంభించాడు. పక్కనున్నది ఓ ఎస్సై అన్న సోయి కూడా లేకుండా.. నోటికి ఎంతొస్తే అంత తిట్టడం మొదలుపెట్టాడు. అంతేనా బెదిరింపులు కూడా చేశాడు.
సరిగ్గా నిలబడలేకపోతున్నా.. గట్టిగట్టిగా అరుస్తూ.. నోటికొచ్చిన బూతులతో పోలీసులను దూషిస్తూ హల్చల్ చేశాడు. ఈ తతంగమంతా.. అక్కడున్న రోగులు, వారి బంధువులకు ఇబ్బందికరంగా మారింది. అతడి చేష్టలు వారిలో భయాందోళనలు కలిగించాయి. ముప్పు తిప్పలు పెడుతున్నా పోలీసులు మాత్రం ఎంతో ఓపికగా మందుబాబును భరించారు. కానీ.. అందరూ అలానే ఉండలేరుగా.. పక్కనే ఉన్న ఎస్సైని ఇష్టానుసారంగా బూతులు తిట్టటంతో ఓ కానిస్టేబుల్.. ఒకానొక సందర్భంలో సహనం కోల్పోవాల్సి వచ్చింది. తన పైఅధికారిని తన ముందే తిడుతుంటే చూస్తూ ఉండలేక.. కోపంలో చేతికి పనిచెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ.. మాట వినలేదు. అతన్ని నివారించటం పోలీసులకు కష్టతరమైంది. ఇంత జరిగినా.. ఆ మందుబాబు మత్తు దిగకపోవటం గమనార్హం. మొత్తానికి మందుబాబులకే బాబులా ఉన్న ఆ బాబు వివరాలు తెలియరాలేదు.
ఇవీ చూడండి: