Mohit take a custody in drug case: మాదక ద్రవ్యాల కేసులో నిందితుడు మోహిత్‌ను హైదరాబాద్ రాంగోపాల్‌పేట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఇటీవల పోలీసులకు చిక్కిన మోహిత్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్ చంచల్‌గూడ జైళ్లో ఉండగా.. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే మోహిత్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
పోలీసుల వినతిని విచారించిన న్యాయస్థానం ఒక రోజు కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు మాదకద్రవ్యాల విక్రయానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మోహిత్‌ను చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. జైలు నుంచి రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు డ్రగ్స్ దందాపై విచారిస్తున్నారు. మోహిత్ వద్ద స్వాధీనం చేసుకున్న చరవాణిలోని వివరాలు రాబట్టనున్నారు. విచారణలో భాగంగా ఎడ్విన్‌తో సంబంధాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. రేపు ఉదయం 10 గంటల వరకూ మోహిత్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.
అసలు మోహిత్ ఎలా దొరికాడు: రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలో నవంబర్ 11 నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు గర్వ్ హరీశ్ బెలనీ అనే వ్యక్తి 4.5 గ్రాముల ఎండీఎంఏతో దొరికాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించిగా గోవా డ్రగ్ డాన్ ఎడ్విన్ న్యూన్స్, బాల మురుగన్ పేర్లు బయటకు వచ్చాయి. పక్కా ప్రణాళికతో వీరిని గోవాలో నార్కోటిక్స్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేసి.. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరో నిందితుడు మోహిత్ అగర్వాల్ అలియాస్ మైరాన్ మోహిత్‌పై నిఘా పెట్టి.. అరెస్టు చేశారు.
డ్రగ్స్ సరఫరాదారులతో మోహిత్‌కు లింకులు: మోహిత్ డీజే ఈవెంట్లు నిర్వహించి మత్తు పదార్థాలు సరఫరా చేసేవాడు. ఇతనిపై గోవాలో ప్రత్యేక బృందం 10రోజులుగా రిక్కీ నిర్వహించింది. అందినట్లే అంది తృటిలో తప్పించుకున్నాడు. ఇంతలోనే కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో స్మగ్లర్ మోహిత్ హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు.. ఆఖరికి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అతని సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 50మందికి పైగా సరఫరాదార్లతో మోహిత్‌కు లింకులు ఉన్నట్లు గుర్తించారు.
కృష్ణ కిశోర్‌కు బెయిల్ మంజూరు: మోహిత్‌ను ప్రశ్నించడం ద్వారా ఈ కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మోహిత్‌తో పాటు పోలీసులకు దొరికిపోయిన స్థిరాస్తి వ్యాపారి కృష్ణ కిశోర్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కృష్ణ కిశోర్ గోవా, ముంబయి, బెంగళూర్ నుంచి మాదక ద్రవ్యాలను తెప్పించుకొని వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కృష్ణ కిశోర్ చంచల్ గూడ జైలు నుంచి బయటికి రానున్నారు.
ఇవీ చదవండి: