ఓ హాస్టల్ వార్డెన్ నుంచి రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి, వాచ్మెన్లు అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.
హాస్టల్ వార్డెన్ బాలరాజు 2019 సంవత్సరంలో మహబూబాబాద్ పట్టణంలోని ఓ హాస్టల్లో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. 2021లో మళ్లీ.. మరిపెడ మండల కేంద్రంలోని ఓ హాస్టల్ వార్డెన్‌గా విధుల్లో చేరాడు. సస్పెండ్ అయిన కాలానికి 7 లక్షల 20 వేల రూపాయలు సప్లమెంటరీ బిల్లులు మంజూరు అయ్యాయి. ఈ బిల్లులు వచ్చాక రెండు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని జిల్లా అధికారి షెడ్యూల్ రాజు డిమాండ్ చేశాడు. దీనిపై బాలరాజు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సోమవారం.. రూ.2 లక్షలు తీసుకొని జిల్లా షెడ్యూల్ కులాల అధికారి ఇంటికి బాలరాజు వెళ్లాడు. ఇంటి పక్కనే ఉంటున్న వాచ్మెన్ గురుచరణ్‌కు ఆ నగదు అందించాలని..సదరు అధికారి చెప్పాడు. ఆ డబ్బు ఇస్తుండగా.. అక్కడే మాటు వేసి ఉన్న అనిశా అధికారులు.. షెడ్యూల్ కులాల అధికారి, వాచ్మెన్ గురుచరణ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని.. కెమికల్ టెస్ట్‌లో రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చిందని ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ చెప్పారు. ఎవరైనా అధికారులు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తే 1064కు కాల్ చేయాలని సూచించారు. గతంలో తామిద్దరం సన్నిహితంగా మెలిగామని.. అయినా లంచం డిమాండ్ చేయడంతోనే అనిశా అధికారులను ఆశ్రయించినట్లు బాధితులు బాలరాజు తెలిపారు.
ఇదీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!