హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించిన భార్య మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించేందుకు భర్త ప్రయత్నించాడు. ప్రమాదం జరగనట్లు పోలీసులు గుర్తించడంతో భర్త అసలు విషయం బయటపెట్టాడు. బీమా కోసమే ఈ డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎస్‌ఐ 2 రామారావు వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మాజీ కౌన్సిలర్లు కాంతారావు, లీలావతి(55) దంపతులు నెల రోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు.
చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. శనివారం తెల్లవారుజామున కారులో తిరిగి వస్తున్నారు. ‘జగ్గయ్యపేట శివారు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో ఎదురుగా లారీ వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో కారును అకస్మాత్తుగా ఆపడంతో డ్యాష్ బోర్డుకు కొట్టుకున్న లీలావతి గుండె ఆగి మరణించింది’ అని కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించలేదు.
పైగా ఆ రోడ్డులో లారీలు ఎదురుగా వచ్చే అవకాశం లేదనే అనుమానంతో పోలీసులు కాంతారావును లోతుగా విచారించారు. దాంతో అతను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. వాస్తవానికి శుక్రవారం రాత్రే ఆమె హైదరాబాద్‌లో మరణించింది. మృతదేహాన్ని జగ్గయ్యపేట తీసుకువచ్చే క్రమంలో అధిక బీమా కోసం ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశానని అంగీకరించారు. వీఆర్‌ఓ ద్వారా వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం.. పోస్టుమార్టం నివేదిక అందిన తరువాత నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.
- ఇదీ చదవండి : Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్ మాట జవదాటను'