దారి దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక కత్తి, ఒక ఆటో, 13 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. తమకు అందిన రెండు ఫిర్యాదుల దర్యాప్తులో భాగంగా ఈ ముఠా సభ్యులను పట్టుకున్నామని వివరించారు.
వరుసగా రెండ్రోజులు దాడులు
ఈ నెల 3న నవీన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పీఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్ ఎదుట నిల్చుని ఉండగా... కొంత మంది తమపై దాడి చేశారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు సీఐ వెల్లడించారు. కొందరు యువతులు, వ్యక్తులు వచ్చి తమ ఫొటోలు ఎందుకు తీశావంటూ కొట్టి వెళ్లిపోయారని తెలిపాడని సీఐ పేర్కొన్నారు. వినోద్ అనే వ్యక్తి ఓ మహిళతో కలిసి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని తిరిగి వస్తుండగా కొంత మంది దాడి చేశారని ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. రాయితో దాడి చేసి ఉంగరం, సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారని చెప్పారని వివరించారు.
ఆటో నంబర్ ఆధారంగా..
ఈ కేసుల్లో భాగంగా నిందితులు వాడిన ఆటో నంబరు ఆధారంగా ఆ ముఠా సభ్యులైన విశాల్, నవీన్, శైలజా, స్వాతి, నవీన్, మధు, మరియ, శివ అనే ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామని సీఐ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు!